SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 24 at 12.51.04 PM

అమరావతి: అమరావతిలో నిరుపేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్‌డీఏలో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. గూడు లేని పేద అక్కచెల్లెమ్మలకు స్థిరనివాసం సమకూర్చి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

 సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాలు, 25 లేఅవుట్‌లలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించిన విషయం తెలిసిందే.

 ఒక్కో ప్లాట్‌ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు ఉచితంగా పంపిణీ చేయడమే కాక.. ఆయా లేఅవుట్‌లలో రూ.384.42 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది.

 విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్‌వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్‌ లైబ్రరీలు, 12 ఆస్పత్రుల నిర్మాణం కూడా చేపట్టనుంది.

 లేఅవుట్ల పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసేందుకు రెండు దశల్లో రూ.168 లక్షలతో 28,000 మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు.

 ఇలా ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాటుతో ఒక్కో పేద అక్కచెల్లెమ్మ చేతుల్లో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పైగా విలువైన స్థిరాస్తిని పెట్టబోతోంది.

 ఈ లెక్కన ఏపీ గృహ నిర్మాణ సంస్థ ద్వారా సీఆర్‌డీఏలోని ఈడబ్ల్యూఎస్‌ లేఅవుట్లలో రూ.1,829.57 కోట్ల వ్యయంతో పేదలకు పక్కా గృహాలను సమకూరుస్తోంది.


SAKSHITHA NEWS