క్రీడలతో పోలీసుల్లో క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి…..
నిరంతర సాధనతోనే విజయాలు.. పోలీస్ క్రీడాకారులకు సీపీ అంబర్ కిశోర్ ఝా పిలుపు….
సాక్షిత పెద్దపల్లి- గోదావరిఖని// : క్రీడలు పోలీస్ సిబ్బందిలో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సమన్వయం, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు.
గోదావరిఖని ఆర్‌సీఓ క్లబ్‌లో నిర్వహిస్తున్న 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 క్లస్టర్–సి కాళేశ్వరం జోన్ పోలీస్ క్రీడా పోటీలను శుక్రవారం సీపీ అంబర్ కిశోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ పోటీల్లో షటిల్ బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్ క్రీడల్లో ఓపెన్ కేటగిరీతో పాటు 18–30, 40+, 50+ వయస్సు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం జోన్ పరిధిలోని రామగుండం పోలీస్ కమిషనరేట్‌తో పాటు కొమురంభీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చెందిన పోలీస్ క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ టీమ్‌వర్క్, పరస్పర సహకారం, నిరంతర సాధనతో పాటు తమ లోపాలను గుర్తించి సరిదిద్దుకోవడం ద్వారా విజయాలు సాధించవచ్చని అన్నారు. పోలీస్ విధుల్లో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, సమన్వయం, జట్టు స్ఫూర్తి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
క్రీడల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన క్రీడాకారులు వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో కాళేశ్వరం జోన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. క్రీడల్లో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బందికి శాఖ తరఫున పూర్తి సహకారం, అవసరమైన మద్దతు అందిస్తామని సీపీ భరోసా ఇచ్చారు.
ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది క్రీడాస్ఫూర్తిని అలవర్చుకుని పరస్పర విశ్వాసంతో సమిష్టిగా పనిచేయాలని సీపీ ఆకాంక్షించారు.
కార్యక్రమంలో అదనపు డీసీపీ–అడ్మిన్ కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్‌ఐలు దామోదర్, పెద్దన్న, రమేష్, మల్లేశం, ఆర్‌ఎస్‌ఐలు వెంకట్, శివ తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
