పేదల జోలికి వస్తే ఊరుకోం: వట్టే జానయ్య యాదవ్

Sakshitha news

పేదల జోలికి వస్తే ఊరుకోం: వట్టే జానయ్య యాదవ్

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: పేదల భూములు, ఇళ్ల నిర్మాణాల విషయంలో జరుగుతున్న అన్యాయాలను ఇకపై సహించబోమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ తీవ్ర హెచ్చరిక చేశారు. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలు, అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆయన మండిపడ్డారు. 2024లో నల్లు ఉమా జ్యోతి రెడ్డి, నల్లు చిత్రరంజన్ రెడ్డి పై కేసు నమోదైనప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కొంతమంది నేతల ప్రోత్సాహంతో అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.

చట్టబద్ధంగా అనుమతులు తీసుకుని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న బడుగు, బలహీన వర్గాల ప్రజలను కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న ఇనుప సామగ్రి, రాడ్లు వంచే యంత్రాలను మున్సిపల్ సిబ్బంది బలవంతంగా స్వాధీనం చేసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. లక్షల రూపాయల విలువైన సామగ్రిని తీసుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండించారు. సివిల్ వ్యవహారాల్లో పోలీసులు జోక్యం చేసుకోవద్దని, ఇదే విధంగా కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చట్టపరమైన అంశాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పోలీసు, మున్సిపల్ అధికారులను కోరారు. పూర్తి స్థాయి విచారణ లేకుండా చర్యలు తీసుకోవడం వల్ల పేదలు కష్టపడి నిర్మించుకుంటున్న ఇళ్లపై పరోక్షంగా దాడులు జరుగుతున్నాయని అన్నారు.

తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, అవసరమైతే ప్రజల ముందుకు తీసుకువస్తామని స్పష్టం చేశారు. భూవివాదంలో సంబంధం ఉన్న వారందరిపై సమగ్ర విచారణ జరిపి, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వట్టే జానయ్య యాదవ్ డిమాండ్ చేశారు.bఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మీరు అక్బర్, టౌన్ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ఆత్మకూరు మండల పార్టీ అధ్యక్షుడు బొల్లే సైదులు, కుంభం వెంకన్న యాదవ్, మధు, చాప్లా, రాగం లింగయ్య, చింత సైదులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top