కాళేశ్వరం పుష్కరాలకు పోలీసుల ముందస్తు ట్రాఫిక్ ఏర్పాట్లు….
క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరగనున్న సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ క్షేత్రస్థాయి సందర్శన నిర్వహించారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు మరియు ఇతర పోలీస్ అధికారులతో కలిసి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న ప్రధాన రహదారులు, వంతెనలు, కీలక కూడళ్లను పరిశీలించారు.
ఈ నెల 21వ తేదీ ఉదయం నుంచి 12 రోజుల పాటు కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు నిర్వహించనున్న నేపథ్యంలో రామగుండం, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా జైపూర్, భీమారం, చెన్నూర్ మార్గాల్లో రద్దీ అధికంగా ఉండే అవకాశమున్నందున ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.
భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు అవసరమైన భద్రతా చర్యలు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుష్కరాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు డీసీపీ ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, కోటపల్లి ఎస్సై రాజశేఖర్, భీమారం ఎస్సై రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

