మొక్కజొన్న నిల్వకు రంగాపూర్‌లో అదనంగా 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం సిద్ధం….
–జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి,
జిల్లాలో ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్న మొక్కజొన్న నిల్వ కోసం అదనపు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోదాములకు తోడు పెద్దపల్లి మండలం రంగాపూర్‌లోని ఐజి గోదాంలో 5 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ గోదాములను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బుధవారం నుంచి జిల్లాలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నుంచి రంగాపూర్ ఐజి గోదాంకు మొక్కజొన్న తరలింపు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
నిల్వ ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మొక్కజొన్న కొనుగోలు, రవాణా, నిల్వ ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
గోదాముల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి నిల్వ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ పర్యటనలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

