వనపర్తి జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నీరు, తాగు నీటి సమస్య తీర్చడానికి అవసరమైన ఇరిగేషన్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు
సాక్షిత వనపర్తి :
త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి పాలమూరు జిల్లా సందర్శించి సాగు, తాగునీటి ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించనున్న నేపథ్యంలో వనపర్తి జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నీరు, భవిష్యత్తులో సైతం తాగు నీటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అవసరమైన ఇరిగేషన్ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి సూచించారు.
రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన పాలమూరు రంగారెడ్డి , మహాత్మగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పురోగతి, ఇంకా మిగిలి ఉన్న పెండింగ్ పనుల పై నాగర్ కర్నూల్ జిల్లలా వట్టేం రిజర్వాయర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఇరిగేషన్ అధికారులతో కలిసి పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి ద్వారా ఏర్పాటు చేసిన ఉమ్మడి పాలమూరు జిల్లాల ఇరిగేషన్ సమీక్షలో శాసన సభ్యులు మాట్లాడుతూ ఇటీవలే గణప సముద్రం భూసేకరణ, కొంకాలపల్లి, బొంకలపల్లి, బండ్రాయిపాకుల గ్రామాల పునరావాస కేంద్రాలకు సంబంధించిన పరిహారం చెల్లించడం జరిగిందని తెలిపారు. ప్యాకేజీ 27 కింద ఇంకా మిగిలి ఉన్న 68.12 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందని, అది త్వరగా పూర్తి అయ్యేవిధంగా చూడాలన్నారు.
కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ ప్యాకేజీ 29 కింద డి-5 ను మరింత బలోపేతం చేసి సామర్థ్యం పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. బుద్ధారం స్టేజ్ 1, 2 కింద డి -5, డి8 కాలువలు వెడల్పు చేయడంతో పాటు మరింత సామర్థ్యం పెంచేందుకు అవసరమైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
ప్యాకేజ్ – 27 కానయపల్లి వద్ద కాంట్రాక్టర్ పనులు దక్కించుకొని ఇప్పటివరకు పూర్తి చేయలేదని, 60- సి కింద నోటీసులు ఇచ్చి మరో కాంట్రాక్టర్ ద్వారా పనులు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను సూచించారు. 14.600 కి.మీ ల మేర బుద్ధారం కుడికాలువ విస్తరించి సామర్థ్యం పెంచేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా సూచించారు.
గట్లఖానాపూర్ రిజర్వాయర్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. బుద్ధారం – 2 రిజర్వాయర్ పనులకు ప్రతిపాదనలు, గొల్లపల్లి రిజర్వాయర్, ప్యాకేజీ 28 కింద తాడిపర్తి చెరువు అదనపు పనులు, ఘనపూర్ బ్రాంచి కెనాల్ , కర్నె తాండా లిఫ్టు ఇరిగేషన్, రంగ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు, రాజీవ్ భీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ – 2 ఏనుకుంట రిజర్వాయర్ నుండి రంగ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు మెయిన్ కెనాల్ వెడల్పు పనుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్యాకేజ్ 19 వద్ద పైపులు పాడైపోయాయని, వాటిని మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
పెబ్బేరు చెరువు సామర్థ్యం 5 టి.యం.సి లకు పెంచేందుకు అవసరమైన నిధుల ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాల్సిందిగా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
నాగర్ కర్నూల్ శాసన సభ్యులు రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఇరిగేషన్ ఎస్.ఈ చంద్రశేఖర్, పార్థసారథి, కార్యనిర్వహక ఇంజనీర్లు అమర్ సింగ్, రవీందర్, శ్రీనివాస్, వనపర్తి ఆర్డీఓ సుబ్రమణ్యం, కొల్లాపూర్ ఆర్డీఓ బన్సిలాల్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
