నగరంలో అడ్డదిడ్డంగా ఉన్న కేబుల్స్ నెలరోజులు లోపు సరిచేయాలి.
*కమిషనర్ ఎన్.మౌర్య
సాక్షిత : తిరుపతి నగరంలో అడ్డదిడ్డంగా ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న కేబుల్స్ ను నెలరోజులు లోపు సరిచేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్థానిక కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్ తో, ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కమిషనర్ మౌర్య నగరంలో ఎక్కడపడితే అక్కడ అస్తవ్యస్తంగా కేబుల్స్ ఉన్నాయని అన్నారు. దీంతో వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని అన్నారు.
అస్తవ్యస్తంగా కేబుల్స్ వలన కడపలో జరిగిన సంఘటనను ఆపరేటర్స్ కు, ఇంటర్నెట్ ప్రొవైడర్స్ కు గుర్తు చేశారు. ఎవ్వరికీ ఇబ్బందులు కలగకుండా సూచించిన క్రమ పద్ధతిలో వైర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. రోడ్డుకి మధ్య స్థంబాలకు వున్న కేబుల్ వైర్లను, ఫైబర్ వైర్లను నెల రోజులలోపు తొలగించాలని అన్నారు. తొలగించిన వైర్లను రోడ్డుకి ఇరువైపులా స్థంబాలకు పద్నాలుగు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని గడువులోపు కేబుల్స్ తొలగించి, నగరం సుందరంగా ఉండేందుకు సహకరించాలని అన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు నరసింహ ఆచారి, నరేంద్ర, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, స్మార్ట్ సిటీ జి.ఎం. చంద్రమౌళి, డి.సి.పి. శ్రీనివాసులు రెడ్డి, ఎస్.పి.డి.సి.ఎల్, బి.ఎస్.ఎన్.ఎల్ అధికారులు, నగరంలోని లోకల్ కేబుల్ ఆపరేటర్స్, తదితరులు ఉన్నారు.