తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో కృష్ణమనాయుడు కుంట ఆధునికరణ పనులను పూర్తి చేసి నవంబర్ 15 లోపు ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. తిరుపతి నగరంలో నిర్మాణంలో వున్న కృష్ణమనాయుడు కుంట పనులను, అదేవిధంగా చెన్నారెడ్డి కాలనీ గుండా ఇస్కాన్ రోడ్డును కలుపుతూ నిర్మిస్తున్న రహదారిని, జబ్బార్ లే అవుట్ వద్ద రోడ్ నిర్మాణ పనులను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసారు.
ఈ సందర్భంగా కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ చెన్నారెడ్డి కాలనీలో అతి పురాతన కృష్ణమనాయుడు కుంట పూర్తి స్థాయిలో శిధిలావస్థలో వుండగా స్థానిక ప్రజలు గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఎమ్మెల్యే సూచనలతో కౌన్సిల్ ఆమోదంతో పురాతన కట్టడాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో కృష్ణమనాయుడు కుంటను ఆధునికరించడం జరుగుతున్నదన్నారు. అతి కొద్ది రోజుల్లోనే అన్ని పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తామని కమిషనర్ తెలిపారు. అదేవిధంగా చెన్నారెడ్డి కాలనీ గుండా ఇస్కాన్ రోడ్డును కలుపుతూ నిర్మిస్తున్న రహదారి పనులు పూర్తి అయితే ప్రజలకి కనెక్టవిటి రహదారి అందుబాటులోకి వస్తుందని, రహదారికి ఇరు వైపులా ప్రహరి గోడలు నిర్మిస్తున్నామని, త్వరలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం జబ్బార్ లే అవుట్ రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం కమిషనర్ హరిత మాట్లాడుతూ తిలక్ రోడ్డు వైపు గుండా జబ్బార్ లే అవుట్ వైపుగా మల్లయ్యగుంట ప్రాంతం వైపుగా రోడ్డును నిర్మిస్తున్నామని, ఇక తారు వేయడం ప్రారంభిస్తున్నామని, ఈ రోడ్డు పూర్తి అయితే చుట్టు ప్రక్కల అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగా ఈ రహదారి అందుబాటులోకి రావడం జరుగుతుందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు.
కమిషనర్ వెంట తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలసుబ్రమణ్యం, డిఈ శ్రావణి పాల్గొన్నారు.