సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి గురువారం క్షీరాభిషేకం నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో సచివాలయ ఉద్యోగులు గురువారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి సీఎం కి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ కుల, మత, వర్గ, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా జగనన్న సంక్షేమ పథకాలు అందరికీ వర్తింప చేయడంలో వాలంటీర్, సచివాలయ వ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆకాంక్షల మేరకు అందరూ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.