SAKSHITHA NEWS

జెసి ప్రభాకర్ రెడ్డీ నోరు అదుపులో పెట్టుకో : బిజెపి నేత వార్నింగ్

బస్సు దగ్ధంతో అనంతపురం రాజకీయం రగిలిపోతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డిన చేసిన కామెంట్స్‌పై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. పద్ధతి మార్చుకోవాలని కూటమిలో చిచ్చు పెట్టొద్దని చెబుతున్నారు.

తెలుగు దేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ మధ్య మొదలైన వివాదం మరింత ముదురుతోంది. జేసీ ప్రభాకర్ చేసిన విమర్శలకు బీజేపీ ఘాటుగా బదులిస్తోంది. జేసీ చేసిన కామెంట్స్‌కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు స్పందించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీ నేత తాడపత్రి మున్సిపల్ ఛైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అనంతపురం జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలను మహిళా కార్యకర్తలను జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. జెసి ట్రావెల్స్ బస్సును బిజెపి నేతలు ఎందుకు దహనం చేస్తారంటూ ప్రశ్నించారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ వల్ల వల్ల కూటమి ప్రభుత్వం ఇబ్బందుల్లో పడేలాగా ఉందని అన్నారు శ్రీనివాస్. వయసులో పెద్దవారు రాజకీయంలో అనుభవం ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. మాధవీలత వృత్తిరీత్యా సినిమాల్లో నటించి ఉండవచ్చునని వారి వృత్తిని అవమానపరిచేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హేయమైన చర్యగా అభివర్ణించారు. బీజేపీ కార్యకర్తలను ట్రాన్స్‌జెండర్స్‌తో పోలుస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీలో ఉన్న ప్రతి కార్యకర్త ఒక శివాజీలాగా పౌరుషంతో ఉంటాడని అన్నారు.

ఇసా మాట్లాడే నేతలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయాలని శ్రీనివాస్ సూచించారు. బీజేపీ ప్రభుత్వంలో బస్సులకు నిప్పంటించారని చెబుతున్న జేసీ ప్రభాకర్‌రెడ్డికి రాష్ట్రాన్ని ఎవరి పాలిస్తున్నారో తెలియదా అని ప్రశ్నించారు. జ్ఞానం కూడా లేకుండా ప్రభాకర్ రెడ్డి మాట్లాడడం సరైనది కాదని అన్నారు. అధికార పార్టీలో ఉంటూ ఈ విధంగా మాట్లాడడం మంచిపద్దతి కాదన్నారు. తన కామెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి డిమాండ్ చేశారు.

అసలేం అయింది

అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి బస్సుల దగ్ధం వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు ప్రభాకర్‌రెడ్డి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా డిసెంబర్‌ 31 పార్టీని విజయవంతం చేశామన్న కారణంతో తనపై కక్షతో బస్‌ తగలబెట్టారని ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్సలు చేశారు. బీజేపీ నేతలంతా ట్రాన్స్‌జెండర్‌గా అభివర్ణించారు.


SAKSHITHA NEWS