SAKSHITHA NEWS

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడికి సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాడి ఆలోచనలను ఇరాన్ మానుకోవాలని సూచించారు.. ‘వద్దు..’ అంటూ ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఇరాన్ దాడికి పాల్పడే అవకాశం ఉందని మాత్రం ఆయన అంగీకరించారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఆయన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

ఇజ్రాయెల్ భద్రతకు మేము కట్టుబడి ఉన్నామని, ఇజ్రాయెల్‌కు కచ్చితంగా మద్దతిస్తామన్నారు. ఇజ్రాయెల్ స్వీయరక్షణకు సహకరిస్తామని, ఇరాన్ ఓటమి తథ్యమని బైడెన్ పేర్కొన్నారు.

మరోవైపు, ఇజ్రాయెల్‌‌‌పై దాడి కోసం ఇరాన్ 100 క్రూయిజ్ మిసైల్స్‌ను సిద్ధం చేసుకుందన్న వార్త సంచలనంగా మారింది. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై డ్రోన్ దాడులు జరిపే అవకాశం ఉందని అమెరికా వర్గాలు భావిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఇజ్రాయెల్‌‌పై నేరుగా దాడులకు దిగడంతో పాటూ ఇతరులతో కూడా దాడులు చేయించే అవకాశం ఉందని సమాచారం.

అయితే, ఇరాన్ మిసైల్, డ్రోన్ దాడుల నుంచి తనని తాను కాపాడుకోవడం ఇజ్రాయెల్‌కు సవాలేనని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి. ఉద్రిక్తతలు ముదరకుండా ఉండేందుకు ఇరాన్ స్వల్ప స్థాయి దాడులు చేసే ఆస్కారం ఉందని అమెరికా అంచనా వేసింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా సైనిక ఉన్నతాధికారులు ఇజ్రాయెల్ సైన్యాధికారులతో సమావేశమై దాడులను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లపై చర్చించారు.

WhatsApp Image 2024 04 15 at 3.27.37 PM

SAKSHITHA NEWS