మహిళల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి, సమస్యలుంటే షీ టీమ్‌ను సంప్రదించాలి…
పెద్దబొంకూర్ గ్రామంలో 100 రోజుల పని మహిళలకు మహిళల భద్రత, సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తున్న షీ టీమ్ సభ్యులు…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దబొంకూర్, . రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ సభ్యులు పెద్దబొంకూర్ గ్రామంలో 100 రోజుల పని మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీమ్ సభ్యురాలు స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత, బాలల రక్షణ, ఆన్‌లైన్ మోసాలు, మాదకద్రవ్యాల నివారణ అంశాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, విద్యాసంస్థలు, జనసమ్మర్థ ప్రాంతాల్లో షీ టీమ్ నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తోందని తెలిపారు.
ఎవరైనా మహిళలు లేదా విద్యార్థినులు వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
అలాగే అధిక లాభాల ఆశతో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవద్దని, లోన్ యాప్స్ వంటి మోసాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు సమాచారం అందించాలని తెలిపారు.
మహిళలు ఎలాంటి ప్రమాదం, బెదిరింపులు లేదా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొన్నా వెంటనే 100 లేదా 112 నంబర్లకు డయల్ చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
