సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
-రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.వి. కర్ణన్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. మంగళవారం కమీషనర్, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి నగరంలోని మంచికంటినగర్ వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. నష్టాన్ని చూసిన కమీషనర్ వారికి ఏమేం కావాలో అడిగి తెలుసుకున్నారు. మొబైల్ హెల్త్ బృందాలను ఏర్పాటుచేసినట్లు, ఇంటింటికి మొబైల్ బృందాలు తిరిగి, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాయని ఆయన అన్నారు.
కమీషనర్ ఈ సందర్భంగా మొబైల్ బృందాల పనితీరును పరిశీలించారు. అనంతరం జిల్లా ప్రధాన ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. వరదల కారణంగా వ్యాధుల బారిన పడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారులు నిరంతరం అందుబాటులో ఉండి, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను కమీషనర్ ఆదేశించారు.
వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ పర్యటన సందర్భంగా నగరపాలక సంస్థ సహాయ కమీషనర్ సంపత్, డిప్యూటీ డిఎం&హెచ్ఓ డా. సైదులు, జిల్లా ప్రధాన ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డా. కిరణ్ కుమార్, ఆర్ఎంఓ డా. రాంబాబు, అధికారులు, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.