SAKSHITHA NEWS

Balakrishna: నేనొస్తున్నా.. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు: బాలకృష్ణ

మంగళగిరి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అవినీతి జరిగిందని సృష్టించి తెదేపా అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు..

ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారని అరోపించారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా సీఎం జగన్‌ పనిచేస్తున్నారన్నారు. జగన్‌ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకృష్ణ మాట్లాడారు.

”పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారు. వేలమంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా? హిందూపురంలో 1,200 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా? ఛార్జిషీట్‌ ఎందుకు వేయలేదు? ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారు. రాజకీయ కక్షసాధింపులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు..

చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు

జగన్‌పై ఈడీ సహా అనేక కేసులున్నాయి.. బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. జగన్‌ 16 నెలలు జైలులో ఉండి వచ్చారు. చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని జగన్‌ కుట్ర చేస్తున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ముందుగా గుజరాత్‌లో ప్రారంభించారు. సీఎం కేవలం పాలసీ మేకర్.. అధికారులే అమలు చేస్తారు. అజేయ కల్లం ప్రతిపాదిస్తే.. ప్రేమ్‌చంద్రారెడ్డి అమలు చేశారు. ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసింది. 2.13 లక్షలమందికి శిక్షణ ఇచ్చారు. డిజైన్‌ టెక్‌ సంస్థకు జగన్‌ ప్రభుత్వం అభినందన లేఖ ఇచ్చింది. జగన్‌.. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు. ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు ..