SAKSHITHA NEWS

హనుమాన్ దీక్ష దుస్తుల్లో ఉన్న విద్యార్థులను లోపలి అనుమతించలేదని ఆరోపణ

విద్యార్థులు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో ప్రిన్సిపాల్, మరొకరిపై కేసు నమోదు

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఉన్న ఓ మిషనరీ స్కూల్ పై పలు హిందూ సంఘాలకు చెందిన కొందరు యువకులు దాడి చేశారు. స్కూల్ యూనిఫాంలో రాకుండా మతపరమైన దుస్తుల్లో ఎందుకు వచ్చారంటూ కొందరు విద్యార్థులను ప్రిన్సిపాల్ ప్రశ్నించడంతో ఈ దాడి జరిగింది. స్కూల్లోకి చొరబడిన ఓ గుంపు అక్కడి వస్తువులను పగలగొట్టడంతోపాటు సిబ్బందిపై చేయి చేసుకుంది. ఈ ఘటనపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.

అధికారుల కథనం ప్రకారం… హైదరాబాద్ కు సుమారు 250 కి.మీ. దూరంలోని మంచిర్యాల జిల్లాలో ఉన్న కన్నెపల్లి గ్రామంలో మదర్ థెరీసా హైస్కూల్ ఉంది. కేరళకు చెందిన జైమన్ జోసెఫ్ ఇక్కడ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు. రెండు రోజుల కిందట కొందరు విద్యార్థులు స్కూల్ యూనిఫాం బదులు కాషాయ దుస్తుల్లో స్కూల్ కు వచ్చారు. ఈ దుస్తులు ఎందుకు వేసుకొచ్చారని ప్రిన్సిపాల్ ప్రశ్నించగా 21 రోజుల హనుమాన్ దీక్ష కోసం వేసుకొచ్చామని వారు బదులిచ్చారు. దీంతో తల్లిదండ్రులను పిలుచుకొస్తే దీనిపై మాట్లాడతానని ప్రిన్సిపాల్ విద్యార్థులకు చెప్పారు.

అయితే ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతోపాటు స్కూల్లోకి విద్యార్థులు కాషాయ దుస్తులు వేసుకొని రావడానికి ప్రిన్సిపాల్ ఒప్పుకోవట్లేదని కామెంట్ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు స్కూల్ పై దాడి చేశాయి. కాషాయ దుస్తులు ధరించిన కొందరు యువకులు జై శ్రీరాం నినాదాలు చేస్తూ కిటికీ అద్దాలను పగలగొట్టారు. దాడి చేయొద్దని టీచర్లు చేతులు జోడించి మొక్కినా వారు వినలేదు. కొందరు యువకులు ప్రిన్సిపాల్ ను చుట్టుముట్టి ఆయనపై దాడి చేశారు. ఆయన నుదుటిపై బలవంతంగా తిలకం దిద్దారు. స్కూల్ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. స్కూల్లోని మదర్ థెరీసా విగ్రహంపై రాళ్లు రువ్వడం ఓ వీడియోలో కనిపించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మత విశ్వాసాలను దెబ్బతీయడం, మతప్రాతిపదికన వివిధ వర్గాల మధ్య చిచ్చుపెట్టడం వంటి సెక్షన్ల కింద స్కూల్ ప్రిన్సిపాల్, మరొకరిపై కేసు నమోదు చేశారు.

WhatsApp Image 2024 04 18 at 1.16.55 PM

SAKSHITHA NEWS