SAKSHITHA NEWS

దిల్లీ: దేశరాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈక్రమంలోనే తాజాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ నిరుద్యోగులను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఐదేళ్లలో దిల్లీలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు ఆయన గురువారం ఓ వీడియోను విడుదల చేశారు. 
‘యువతకు ఉపాధి కల్పించడమే నా ప్రాధాన్యత. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు మా బృందం ఓ ప్రణాళికను రూపొందిస్తోంది. పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వం రెండేళ్లలో 48 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది.

అంతేకాక.. మూడు లక్షలకు పైగా ప్రైవేటు రంగ ఉద్యోగాలను కల్పించాం. ఉపాధి ఎలా సృష్టించాలో మాకు బాగా తెలుసు. ప్రజల మద్దతుతో మళ్లీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో దిల్లీలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తా’ అని కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు.
కాగా.. దేశ రాజధానిలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

8న ఫలితాలు వెలువడనున్నాయి. మూడో సారి అధికారం సాధించేందుకు ఆప్‌ ప్రయత్నిస్తుండగా.. ఈ సారి ఎలాగైన ఆప్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్‌, భాజపా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.

SAKSHITHA NEWS

DOWNLOAD APP

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app