
ముంబయి: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో షరీఫుల్ ఇస్లాం అనే వ్యక్తిని నిందితుడిగా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు కస్టడీలో ఉన్నాడు. ఈ పరిణామాలపై అతడి తండ్రి మొహమ్మద్ రూహుల్ అమీన్ ఫకీర్ స్పందించాడు. తన కుమారుడిని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపించాడు. దోపిడీకి సంబంధించి పోలీసులు విడుదల చేసిన వీడియోలో ఉన్న వ్యక్తి తన కుమారుడు కాదన్నాడు. అవే పోలికలతో ఉన్న మరొక వ్యక్తి స్థానంలో తన కుమారుడిపై తప్పుడు కేసు పెట్టారని అన్నాడు.
చిన్నప్పటి నుంచి షరీఫుల్ జుట్టును చిన్నగా కత్తిరించుకుంటాడని.. కానీ, వీడియోలో ఉన్న వ్యక్తి భిన్నంగా ఉన్నాడని పేర్కొన్నాడు. 30ఏళ్ల పాటు ఒకేలా ఉన్న వ్యక్తి హఠాత్తుగా ఎలా మారిపోతాడని ప్రశ్నించాడు. ప్రతినెలా 10వ తేదీన జీతం తీసుకున్న తర్వాత తమకు ఫోన్ చేస్తాడని తెలిపాడు. సైఫ్‌పై దాడి జరిగిన మర్నాడు కూడా తన కుమారుడితో మాట్లాడామన్నాడు. భద్రతా సిబ్బందిని దాటుకొని..బాలీవుడ్ హీరోపై దాడి చేయడం సామాన్యులకు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించాడు. ఈ కేసుపై పోరాడేందుకు భారత్‌లో తమకు సాయం చేసేవారు ఎవరూ లేరని వాపోయాడు. ఈ విషయంపై బంగ్లాదేశ్ కోర్టును ఆశ్రయిస్తామన్నాడు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనా అధికారంలో ఉన్న సమయంలో దేశంలో ఉద్రిక్తతలు చెలరేగడంతో 2024 మార్చిలో షరీఫుల్ అక్రమంగా భారత్‌కు వలస వచ్చాడని అతడి తండ్రి తెలిపాడు. తొలుత పశ్చిమ బెంగాల్‌లో పని చేసేవాడని అన్నాడు. ముంబయిలో ఎక్కువ జీతాలు ఉంటాయని అక్కడికి వెళ్లి.. ఓ హోటల్‌లో పని చేస్తున్నాడని చెప్పాడు. ఇటీవల అతడి యజమాని రివార్డు సైతం ఇచ్చినట్లు తమకు వెల్లడించినట్లు పేర్కొన్నాడు. ముంబయి పోలీసులు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని అన్నాడు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app