బాపట్ల
అన్నదానానికి ఆర్మీ విజయ్ ఆర్థిక సాయం
- నరసాయయపాలెం సర్పంచి, పెద్దలకు రూ. 60 వేలు అందజేత
బాపట్ల:
నాకు ఆకలి విలువ ఏంటో తెలుసని నలుగురికి అన్నం పెట్టేందుకు నా వంతుగా ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని యువ పారిశ్రామికవేత్త ఆర్మీ విజయ్ తెలిపారు. బాపట్ల మండలంలోని నరసాయపాలెం గ్రామంలో మరియమ్మతల్లి యేసుక్రీస్తు స్వరూపాల మూడో ప్రతిష్ట వార్షికోత్సవం వేడుకకు తప్పక హాజరుకావాలని గ్రామ సర్పంచ్ దాసి సుదర్శన్ రావు ఎంపీటీసీ దేవరపల్లి రవికుమార్ ఆర్మీ విజయ్ ని శుక్రవారం తన స్వగృహంలో కలిసి ఆహ్వానించారు. శనివారం తమ గ్రామంలో ఏసుక్రీస్తు, మరియమ్మ తల్లి స్వరూపాల ప్రతిష్ట మూడవ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మీ విజయ్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు దైవ కార్యక్రమాలకు కచ్చితంగా హాజరవుతానని తెలిపారు. తన వంతుగా 60 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అన్నదానం నిమిత్తం చేస్తున్నానని సర్పంచ్ కి గ్రామ పెద్దలకు అందించారు. మనిషికి డబ్బు అధికారం శాశ్వతం కాదన్నారు. మనం తోటి వారికి చేసే మంచి పనులే భూమిపై చిరస్థాయిగా మిగిలిపోతాయనేది నా నమ్మకం అన్నారు.
తాను ఎంతో కష్టపడి ఈ స్థితికి వచ్చానని భగవంతుని అనుగ్రహం లేనిదే ఈ స్థితిలో ఉండలేనని ఆయన అన్నారు. మన సంపాదనలో కొంత భాగం దైవ కార్యక్రమాలకు వెచ్చిస్తే ఆ అనుభూతే వేరన్నారు. నరసాయపాలెం ఎస్సీ కాలనీ అభ్యున్నతి కోసం ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తానన్నారు. నా తుది శ్వాస వరకు ప్రజాసేవను కొనసాగిస్తానని ఆర్మీ విజయ్ తెలిపారు. స్వార్థం, లాభపేక్ష లేకుండా పేద ప్రజలకు నిస్వార్థంతో సేవ చేయడమే తనకు తెలుసు అన్నారు. దళితుల యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ యువత సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. తరతరాలుగా దళితులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని ప్రభుత్వం అందించే సహకారంతో ఆర్థిక అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.. ప్రతి గ్రామంలో దళిత సోదరులు ఐకమత్యంతో ప్రేమానురాగాలతో కలిసి మెలిసి జీవించాలని సూచించారు. రాజకీయ పార్టీలు వ్యక్తిగతమని గ్రామ అభివృద్ధి విషయంలో పార్టీలకు తావు లేకుండా సమిష్టిగా అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ఆర్మీ విజయ్ ని కలిసిన వారిలో గ్రామ పెద్దలు సతీష్, దేవరపల్లి చిలకయ్య, సిద్దయ్య బత్తుల యేషయ్య, పూర్ణచంద్రరావు, శ్రీరామ్, గుడిపూడి జోసెఫ్ తదితరులు ఉన్నారు.