SAKSHITHA NEWS

ఈసీవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలింగ్ కు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. 13 వ తేది అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు.

ఈవీఎంలను సీల్ చేసే ప్రక్రియ జరిగిందన్నారు. పరిశీలకుల నుంచి రీ పోలింగ్‎కు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు. 33 ప్రాంతాల్లో 350 స్ట్రాంగ్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 3,33,40,560 మంది పార్లమెంట్ స్థానాలకు ఓటు వేశారని, అలాగే అసెంబ్లీ కి 3,33,40,333 ఓటు వేసినట్లు గణాంకాలను వెల్లడించారు.

కేవలం ఈవీఎంల ద్వారా మొత్తం 80.66 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. అలాగే 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు నమోదయ్యాయని, ఈ రెండింటినీ కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా 81.86శాతం పోలింగ్ జరిగినట్లు పేర్కొన్నారు. 4,97,000 మంది పోస్టల్, హోం బ్యాలెట్ వినియోగించుకున్నారన్నారు.

దేశంలోనే అత్యధిక పోలింగ్ నమోదైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ పెరగడం మంచి సంకేతమన్నారు.పోల్ తర్వాత తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావు పేటలో చాలా హింసాత్మక ఘటనలు జరిగాయని వివరించారు.

నాలుగు ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టి, అదనపు బలగాలు మొహరించామన్నారు. అభ్యర్ధులు అందరినీ హౌస్ అరెస్టు చేయాలని అదేశాలిచ్చినట్లు తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. EVM లు ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలని ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.

ఘటనలు అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు.

రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారి వివరాలు ఇలా..

అసెంబ్లీ స్థానాలకు..

  • పురుషులు – 1,64,30,143
  • మహిళలు – 1,69,08,678
  • థర్డ్ జెండర్ – 1512

పార్లమెంట్ స్థానాలకు..

  • పురుషులు – 1,64,30,359
  • మహిళలు – 1,69,08,684
  • థర్డ్ జెండర్ – 1517
WhatsApp Image 2024 05 15 at 16.48.22

SAKSHITHA NEWS