ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి

Sakshitha news

ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి….

బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.. సీపీఐ ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం….

— తాండ్ర సదానందం…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, సుల్తానాబాద్/
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను సోమవారం సుల్తానాబాద్ మండల కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికులు, కర్షకులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం విధానాలను అమలు చేస్తోందని ఆరోపిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ప్రజా చైతన్య యాత్ర ఉద్దేశమని సదానందం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, పేపర్ లీకేజీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. మతతత్వ విధానాలను ప్రోత్సహిస్తూ కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించి దేశంలో అశాంతికి కారణమవుతోందని ఆరోపించారు.

ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని, దేశ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేస్తున్నారని సదానందం విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

‘బీజేపీ హటావో.. దేశ్ కీ బచావో’ నినాదంతో సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో సీపీఐ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రజలను సమీకరిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు గౌతమ్ గోవర్ధన్, గోశిక మోహన్, కే. కనకరాజు, రామగుండం నగర సీపీఐ కార్పొరేటర్ మార్కాపురి సూర్య, కోడం స్వామి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, తాళ్లపల్లి మల్లయ్య, ఎం. ఎల్లయ్య, ఎజ్జ రాజయ్య, ఓదమ్మ, పూసల రమేష్, ప్రీతం, శనిగరపు చంద్రశేఖర్, తోడేటి లావణ్య, రచన, ఎం. తిరుపతి, శ్రీనివాస్ రెడ్డి, గట్టయ్యతో పాటు ప్రజానాట్యమండలి కళాకారులు పాల్గొన్నారు.

Scroll to Top