తల్లిదండ్రుల మమకారాన్ని చాటే సందేశాత్మక చిత్రం

Sakshitha news

తల్లిదండ్రుల మమకారాన్ని చాటే సందేశాత్మక చిత్రం
‘తిరగబడ్డ మమకారం’ లఘుచిత్రం షూటింగ్ ప్రారంభం….

సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : నిరీక్షణ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘తిరగబడ్డ మమకారం’ లఘుచిత్రం షూటింగ్ గోదావరిఖని చంద్రశేఖర్‌నగర్‌లోని నిరీక్షణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇప్టా జాతీయ సమితి, ప్రజా నాట్యమండలి కళాకారుడు కవ్వంపల్లి స్వామి, సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ, ఎన్‌పీడీసీఎల్ రిటైర్డ్ ఏడీఈ కె. వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి చిత్రీకరణను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పోతుల చంద్రపాల్ రూపొందించిన లఘుచిత్రాలు సామాజిక అంశాలతో సమాజాన్ని ఆలోచింపజేసేలా ఉన్నాయని తెలిపారు. అదే తరహాలో ‘తిరగబడ్డ మమకారం’ కూడా సమాజానికి చక్కటి సందేశాన్ని అందించేలా తెరకెక్కుతోందన్నారు.

కన్నవాళ్లను నిరాశ్రయులను చేసినప్పుడు తల్లిదండ్రులు తమ మమకారాన్ని చంపుకుని తిరగబడితే ఏర్పడే పరిస్థితులను ఈ చిత్రంలో చూపించనున్నట్లు తెలిపారు. పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరాన్ని తెలియజేసేలా ఈ లఘుచిత్రం ఉంటుందని పేర్కొన్నారు.

ఇటీవల లఘుచిత్రాల పేరుతో కొందరు అభ్యంతరకరమైన శీర్షికలు, దృశ్యాలతో చిత్రాలను రూపొందించడం ఆందోళన కలిగిస్తోందని వారు అన్నారు. దర్శకులు, నిర్మాతలు వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తూ సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలను రూపొందించాలని సూచించారు. ‘తిరగబడ్డ మమకారం’కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించాలని ఆకాంక్షించారు.

కాగా, గతంలో పలు సామాజిక అంశాలపై లఘుచిత్రాలను రూపొందించిన పోతుల చంద్రపాల్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. సీనియర్ పాత్రికేయులు మేజిక్ రాజా, పోతు శంకరయ్య, సిరిపురం శ్రీనివాస్, సతీష్, శ్రీలత, రజిత, వేదశ్రీ, అస్మిత్ పాల్గుణ, రియా వృంద తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తిప్పబత్తిని అంజయ్య మేకప్‌మెన్‌గా, కో-డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో బీరుక లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top