బాలికల విద్యకు అండగా ఎన్‌టీపీసీ.. 171 సైకిళ్ల పంపిణీ….
విద్యార్థినుల పాఠశాల రాకపోకలు సులభతరం చేయడమే లక్ష్యం….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని, ఎన్‌టీపీసీ// : రామగుండం సీఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా రామగుండం మండలంలోని ఎనిమిది పాఠశాలలకు చెందిన 9వ తరగతి బాలికలకు 171 సైకిళ్లను పంపిణీ చేశారు. గోదావరిఖని అశోక్‌నగర్‌లోని జెడ్పీహెచ్‌ఎస్ (బాలికల) పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలికలు తమ విద్యాభ్యాసాన్ని నిరాటంకంగా కొనసాగించేందుకు అవసరమైన సహకారం అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థినులు సైకిళ్లను సద్వినియోగం చేసుకుని క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్ కార్యక్రమం ద్వారా బాలికలకు పాఠశాలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు ప్రయాణ ఇబ్బందులు తగ్గి, సురక్షితంగా పాఠశాలకు చేరుకునే అవకాశం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం బాలికల్లో విద్య పట్ల ఆసక్తిని పెంచడంతో పాటు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా చేపట్టినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
