SAKSHITHA NEWS

2 లక్షల పైనున్న మొత్తం చెల్లించకుండానే రుణమాఫీ చేయాలి.
29న రాష్ట్రవ్యాప్తంగా తాసిల్దార్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలను జయప్రదం చేయండి : సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి.


సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : రైతు రుణమాఫీ రాజకీయ రంగు పులుముకుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గం సమావేశం ఆయన మాట్లాడుతూముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లుగా మారిందన్నారు. రైతులకు ఎవరి రాజీనామాలతో అవసరం లేదన్నారు.ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేస్తే చాలన్నారు. తెల్లరేషన్‌కార్డు నిబంధన ఎత్తివేయాలని, రూ.2 లక్షల పైనున్న మొత్తాన్ని చెల్లించకుండానే మాఫీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. ఇపొలిటికల్‌ మైలేజ్‌ కోసం అధికార, ప్రధాన ప్రతిపక్షాలుప్రయత్నిస్తున్నాయన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ అయినట్లు ప్రకటించి సీఎం పచ్చి అబద్ధాలు ఆడారన్నారు. దీనికి ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రకటనలే నిదర్శనమన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చారని,పార్లమెంట్‌ ఎన్నికలప్పుడు సీఎం ఏ జిల్లాకు పోతే అక్కడి దేవుళ్ల సాక్షిగా ప్రమాణం చేశారని గుర్తు చేశారు.

చాలెంజ్‌లు పూర్తయ్యాయి తప్ప రుణమాఫీ కాలేదని విమర్శించారు. ఆగష్టు 15 నాటికి మాఫీ పూర్తి చేస్తామని ప్రకటించిన మాట నిలబెట్టుకున్నట్టు చూపేందు కోసం మూడు విడతలుగా కొద్దిమందికే రూ.2లక్షల రుణమాఫీ చేశారని తెలిపారు.రూ.31 కోట్ల రుణాల మాఫీకి క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పటి వరకు రూ.22వేల కోట్లు మాఫీ అయినట్లు సీఎం అబద్ధపు ప్రకటన చేశారని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి ఇప్పటి వరకు రూ.7,500 కోట్లు మాత్రమే జమైనట్లు ప్రకటన చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఎస్‌ఎల్బీసీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 45 లక్షల మంది రైతులున్నారని, వీరికి రూ.49వేల కోట్లు మాఫీ చేయాలని తెలిపారు. కానీ ప్రభుత్వం రూ.31వేల కోట్లు మాత్రమే తేల్చిందన్నారు. కానీ అది కూడా పూర్తి చేయలేదన్నారు. రాష్ట్రంలోని 40 బ్యాంకుల్లో 5,742 బ్రాంచీల్లో 41,78,892 మంది రైతులు అప్పులు తీసుకున్నారని తెలిపారు. మాఫీ పూర్తిస్థాయిలో కాకపోవడానికి ప్రభుత్వం 31 రకాల సమస్యలు అడ్డువచ్చినట్లు సాకు చెబుతోందన్నారు. వీటిలో ప్రధాన సమస్య తెల్ల రేషన్‌కార్డని అన్నారు. రేషన్‌కార్డు ప్రామాణికం కాదని సీఎం, మంత్రులంటున్నారే తప్ప మార్గదర్శకాల్లో మాత్రం దానినే ప్రాతిపదికగా తీసుకున్నారని తెలిపారు. రుణమాఫీ మార్గదర్శకాల్లో తెల్లరేషన్‌కార్డు అనే నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. సుమారు 15 ఏళ్లుగా రేషన్‌కార్డులు ఇవ్వలేదన్నారు.రూ.2లక్షలకు పైనున్నా అంత వరకు మాఫీ చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఆ పైనున్న డబ్బులు కట్టమని ఒత్తిడి చేస్తోందన్నారు. కాబట్టి రూ.2 లక్షల పైనున్న నగదును చెల్లించమనే కండీషన్‌ కూడా ఎత్తివేయాలని కోరారు.

ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా నిజాయితీగా మాఫీ చేయాలన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 40% మందికే రుణమాఫీ చేశారన్నారు. సూర్యాపేట జిల్లాలో కేవలం 40% మందికే మాఫీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో లక్షల మంది అర్హులైన రైతులుంటే కొద్ది మందికే రుణమాఫీ చేశారన్నారు. రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులుంటే వివిధ కారణాలతో కేవలం 42 లక్షల మందికే రుణాలుఅందుతున్నాయన్నారు.గత ప్రభుత్వం రెండు విడతలుగా రూ.35,240 కోట్ల రుణమాఫీ చేసినా దానిలో రూ.21,800 కోట్లు వడ్డీల కిందనే జమ చేసినట్లు వివరించారు. ప్రభుత్వం ఆలస్యంగా నిధులు జమ చేయడం వల్ల రైతులు లబ్ధి పొందలేకపోతున్నారన్నారు. కాబట్టి షరతులు లేకుండా.ఆలస్యం కాకుండారుణమాఫీ వర్తింపజేయాలన్నారు. 29న సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ ధర్నాకు రుణమాఫీ కానీ రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగినఈసమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS