SAKSHITHA NEWS

వ్యవసాయ పరిశోధనలు గ్రామ స్థాయికి చేరాలి – సమీక్షలో తిరుపతి కలెక్టర్
సాక్షిత, తిరుపతి బ్యూరో: పెట్టుబడి తగ్గించి ఆదాయం పెంచే విధంగా వ్యవసాయ రంగ పరిశోధనలు గ్రామ స్థాయిలో రైతులకు చేరాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. రైతులకు అందిస్తున్న సేవలను అధికారులు దేవుడిచ్చిన వరంగా భావించాలని, రైతులు బోర్ల వద్ద ప్రత్యామ్నాయ పంటలకు మొగ్గు చూపాలని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగి రెడ్డి అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ లు రైతు సంఘాల ప్రతినిధులతో, రైతులతో, వ్యవసాయ అనుబంద శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మాసం జరిగే వ్యవసాయ మండలి సమావేశాలో అర్థవంతమైన చర్చలు జరిపి రైతుల అవసరాలను గుర్తించి వ్యవసాయ మిషన్ కు నివేదించాలని అన్నారు. వ్యవసాయ మిషన్ కు చైర్మన్ గా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని, వైస్ చైర్మన్ గా నాగిరెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను గుర్తించి రైతులకు అనుకూల జి.ఓ. లకు తన వంతు సహాయం చేస్తున్నారని అన్నారు. రైతు భరోసా కేంద్రాలలో, సి.హెచ్.సి లలో ఉన్న సౌకర్యాలను రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. రైతులు కొన్ని పంటలపై నష్టం వస్తుందని తెలిసినా పంటలు వేస్తుంటారని ఆర్.బి.కె లు, శాస్త్రజ్ఞుల సహాయం తీసుకోవాలని సూచించారు. వ్యవసాయం పై మొగ్గు చూపడానికి యువత కూడా ముందుకు వస్తున్నారని వ్యవసాయ రంగ అనుబంధ శాఖలు రైతుల ఆదాయం పెంచే విషయంలో చాలెంజ్ గా తీసుకుని పనిచేసి ఆంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణ గా నిలపాలని, విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని సూచించారు. వైస్ చైర్మన్ మాట్లాడుతూ రైతు అన్నవాడు నోరు లేని మనిషని, పంట నష్టం వస్తే భాద పడతాడే తప్ప మరేమీ చేయడని అందుకే అధికారులు రైతులకు తోడుగా నిలవాలని అన్నారు. రాష్ట్రంలో 10,700 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని ఈ సారి ధాన్యం 135 లక్షల టన్నులు పంట వస్తే 80 లక్షలు టన్నులు సేకరించి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించిందని అన్నారు. 2021 – 22 ఆర్ధిక సంవత్సరం నీతి అయోగ్ గణాంకాల మేరకు దాన్యం పండించడంలో 20 వ స్థానంలో ఉన్నామని దేశం మొత్తం మీద 25 శాతం మన వద్దే పండిస్తున్నారని అన్నారు. దీనికి కారణం రైతు భరోసా, పి.ఎం. కిసాన్, ఆర్ బి.కె. ల ఏర్పాటు, 9 గంటల ఉచిత విద్యుత్ వంటివి రైతుకు మేలు చేస్తున్నాయని అన్నారు. రైతులకు శాస్త్ర వేత్తలు దేవుళ్ళు గాను , పరిశోదనాలయాలు దేవాలయాలుగా భావిస్తారని అందుకే ఏ పంట వేసుకోవాలా అన్న విషయాన్ని క్షేత్ర స్థాయిలో వివరించాలని అన్నారు. బోర్ల వద్ద సాగు పూర్తిగా ప్రత్యామ్నాయ పంటలకు మారాలని, చెరకు విషయంలో మన రాష్ట్రం కాక దేశంలో కూడా ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయని అందుకే చెరకు ప్రత్యామ్నాయంగా వెదురు, మిల్లెట్స్ వంటి వాటిపై మొగ్గు చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ రఘునాథ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిణి దొరసాని, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాస నాయక్, హార్టి కల్చర్ అధికారి రఘునాథ రెడ్డి, రైతు సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS