SAKSHITHA NEWS

అడవుల సంరక్షణకు చర్యలు చేపట్టండి – తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
సాక్షిత, తిరుపతి బ్యూరో: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అడవుల సంరక్షణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ లో ఆయన నిత్యం అనేక విభాగాల సమస్యలపై, ప్రజా సంక్షేమంపై అంశాలు లేవనెత్తి పరిష్కారం సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే అడవుల సంరక్షణ గురించి మాట్లాడారు. అడవిలో నియంత్రణ లేకుండా దావానలంలా వ్యాపించే కలుపు మొక్కల తొలగింపు కోసం పని చేస్తుందా అని ప్రశ్నించారు. ఆక్రమణ వృక్ష జాతుల తొలగింపు పని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వర్తింప చేయడం లేదని సభలో ప్రస్తావించారు. అందుకు సమాధానంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి బదులిస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది డిమాండ్ ఆధారిత వేతన ఉపాధి కార్యక్రమం అని, ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి డిమాండ్‌కు అనుగుణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల కంటే తక్కువ కాకుండా మాన్యువల్ పనిని ఉపాధిగా అందించడం జరుగుతోందన్నారు. ఈ చట్టంలోని షెడ్యూల్ -1 పేరా 4(3) ప్రకారం గడ్డి, గులకరాళ్లు తొలగించడం, వ్యవసాయ కార్యకలాపాలను అంచనా వేయలేని, పునరావృతమయ్యే పనులు చేపట్టబడవని దీని ప్రకారం కలుపు మొక్కల తొలగింపు, ఆక్రమణ వృక్ష జాతుల తొలగింపు పనులు ఈ పథకం కింద అనుమతించబడవని సమాధానం ఇచ్చారు. .
అలాగే వన్యప్రాణుల ఆవాసాలను, నీటి నాణ్యతను క్షీణింపజేస్తాయని తద్వారా పర్యావరణ హాని కలుగజేస్తాయని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎంపీ కోరారు.


SAKSHITHA NEWS