దేవినేని చిట్టా అంతా అక్రమాల పుట్ట
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన గురువారం మైలవరంలో మీడియాతో మాట్లాడుతూ నిత్యం జగనన్న, వైసీపీపై విషం కక్కే యెల్లోమీడియాను అడ్డం పెట్టుకొని అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదన్నారు.
కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడి, వెలగలేరు తదితర గ్రామాల్లో అక్రమ మైనింగ్ కు పాల్పడుతూ పోలవరం కట్టలు కూడా తవ్వుతుంటే తానే స్వయంగా జిల్లా కలెక్టరుకు లేఖ రాశానని స్పష్టం చేశారు. దీనిపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి అక్రమార్కులపై చట్టప్రకారం తగు చర్యలు తీసుకుంటారని, తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు.
దీనివల్ల తనకు ప్రజల్లో వస్తున్న మంచిపేరును చూసి తట్టుకోలేక మాజీమంత్రి దేవినేని ఉమా హడావిడిగా ఆయా మైనింగ్ ప్రాంతాలకు వెళ్లి, మొసలి కన్నీరు కార్చుతూ, తనపై ఇష్టారాజ్యంగా మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పదిరెట్లు పెనాల్టీ వేయాలని చెప్పడానికి నువ్వేవడవి అంటూ దేవినేని ఉమాను ఘాటుగా ప్రశ్నించారు. దేవినేని జలవనరుల శాఖ మంత్రిగా వున్నప్పుడు కృష్ణానదిలో అడ్డగోలుగా జరిగిన ఇసుక తవ్వకాల్లో ఎన్.జి.టి 100 కోట్ల రూపాయల పెనాల్టీ వేశారని, నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ సొమ్ము చెల్లించాలని ఉమాకు సవాల్ విసిరారు. దేవినేని చిట్టా అంతా అక్రమాల పుట్ట అని విమర్శించారు. ఇవన్నీ వదిలేసి కొండపల్లి అడవి కొట్టేశారని పాత పిట్ట కథలు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు.
ఇక ప్రతి గడప వద్దకు సంక్షేమాభివృద్ధి పాలనతో చేరువైన సీఎం జగనన్న స్టిక్కర్లు వారి అనుమతితో అతికిస్తుంటే ఆతనికి ఎందుకు అంత కడుపునొప్పి? అని ప్రశ్నించారు. మా పార్టీ అధిష్ఠానం పిలుపుమేరకు మా పని మేము చేసుకుంటామన్నారు. రెండుసార్లు నందిగామ ఎమ్మెల్యేగా, రెండుసార్లు మైలవరం ఎమ్మెల్యేగా, ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన కాలంలో ఉమా ఏనాడైనా సరే ప్రజల వద్దకు నేరుగా వెళ్ళాడా? అని ప్రశ్నించారు. నీకు దమ్ముంటే గత ప్రభుత్వం నీ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన 600 హామీల్లో ఏమేమి అమలు చేశారో… ప్రతిగడప వద్దకు వెళ్లి చెప్పుకోవాలని సవాల్ విసిరారు.
దేవినేని ఉమా నువ్వు పద్ధతి, సంస్కారంతో మాట్లాడితే తాను కూడా అదేవిధంగా సమాధానం ఇస్తామన్నారు. దేవినేని ఉమా వెకిలి చేష్టలు చూసి, వికృత మాటలు విని ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని, 2024లో కూడా అతడిని నియోజకవర్గ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పి ఇక్కడి నుంచి శాశ్వతంగా తరిమికొడతారని పేర్కొన్నారు.