– తాళం వేసిన ఇంట్లో చోరీ
- 47 తులాల బంగారం, 8లక్షల నగదు చోరీ
— సంఘటన స్థలాన్ని పరిశీలించిన డి.ఎస్.పి
చిట్యాల సాక్షిత ప్రతినిధి
నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో వేణుగోపాల స్వామి వెంచర్ లో ఉన్న రియల్టర్ గంజి రాంమూర్తి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఇంటి యజమాని కుటుంబంతో వ్యక్తిగత పనుల నిమిత్తం బయటికి వెళ్లిన సందర్భంలో దొంగలు నేరుగా తాళం పగలగొట్టి ఇంట్లో బీరువాలో ఉన్న 47 తులాల బంగారం 8 లక్షల నగదు ని చోరీ చేశారు. వేరొక బెడ్ రూమ్ లో ఉన్న బీరువాలో కూడా బంగారం ఉంది కానీ దొంగలకు దొరకక పోవడం తో వెళ్ళిపోయారు. ఇంటి యజమాని సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా బీరువాలోని వస్తువులు చెల్లాచెదురుగా ఉండడం చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిఐ శివరాం రెడ్డి, ఎస్.ఐ రవి లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ని పిలిపించి క్షుణ్ణంగా తనిఖీ చేయించారు. మొదట డాగ్స్ ఇంటి నుండి జాతీయ రహదారి వైపు వచ్చి తిరిగి రైతు వేదికకు వెళ్లే మార్గంలో పేపర్ ప్లేట్స్ తయారీ గోదాం దగ్గరకి వెళ్లి ఆగిపోయాయి. ఇంట్లో సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యే హార్డ్ డిస్క్ ని కూడా దొంగలు చోరీ చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం రెక్కీ నిర్వహించి చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డిఎస్పీ నరసింహ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి ఇంటి యజమానులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం డిఎస్పి మాట్లాడుతూ దొంగలు పక్కా ప్రణాళిక ప్రకారం చోరీ చేశారని క్లూస్ టీం పూర్తి వివరాలు సేకరించారని పూర్తి విచారణ చేసి నిందితులను పట్టుకుంటామని తెలిపారు. సీఐ శివరాంరెడ్డి మాట్లాడుతూ పరిసరాలలో ఉన్న సిసి ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేస్తామని తెలిపారు. అలాగే ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు ఉంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.