SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 25 at 12.57.11 PM

హైదరాబాద్:
చినుకు పడితే చిత్తడే అన్న తీరుగా భాగ్యనగర రోడ్లు తయారయ్యాయి. కొద్దిసేపటి వర్షానికే నగర రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నగరంలో ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోందని వాహనదారులు వాపోతున్నారు. ఉదయం నగరంలో భారీగా వర్షం కురిసింది. దీంతో ఉదయమే ఆఫీసు, స్కూళ్లకు వెళ్లే వాహనాలతో ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది. 10 నిమిషాల ప్రయాణానికే వాహనదారులు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. షేక్ పేట్ – రాయదుర్గం మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉప్పల్ నుంచి తార్నాక వెళ్లే మార్గంలోనూ పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అటు సికింద్రాబాద్ నుంచి బేగంపేట్ రోడ్‌లో హెవీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలాగే దిల్‌సుఖ్‌నగర్ నుంచి మలక్‌పేట్, చాదర్ఘాట్ వైపు ట్రాఫిక్ నిలిచిపోగా.. ఇటు కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెర్‌ ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైటెక్ సిటీలోనూ వాహనాలు ఎక్కడివి అక్కడే రోడ్లపై ఉండిపోయాయి. ఎంతసేపటికి ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.

మరోవైపు రాష్ట్రంలో మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు


SAKSHITHA NEWS