సాక్షిత తిరుపతి : నగరంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు. విష్ణు నివాసం పక్కన గల రోడ్డులో మురుగునీరు వస్తుండడం చూసి పారిశుద్ధ్య సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విష్ణు నివాసం పక్కన ఉన్నటువంటి తోపుడు బండ్లు నిర్వహించే వారు, షాపుల వాళ్ళు కాలువల్లో చెత్త వేస్తున్నారని సిబ్బంది చెప్పడంతో, కమిషనర్ హరిత స్పందిస్తూ పారిశుద్ధ్య అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి కాలువల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన వారిని గుర్తించి జరిమానాలు విధించాలని సిబ్బందిని ఆదేశించారు.
ప్రతి వార్డుల్లో సచివాలయ శానిటరీ సెక్రెటరీలు ప్రతిరోజూ వార్డుల్లో పర్యటించి డ్రైన్ శుభ్రంగా ఉండేలా చెత్త తీయించాలన్నారు. నిరంతరం శుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, తిరుపతి పుణ్యక్షేత్రాన్ని పరిశుభ్రత నగరంగా నిలిపేందుకు అందరం సమిష్టిగా కృషి చేద్దామన్నారు. కమిషనర్ వెంట మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, పారిశుద్ధ్య అధికారులు, సిబ్బంది ఉన్నారు.