SAKSHITHA NEWS

బాపట్ల జిల్లా

క్రీడా స్వరూపం కన్నుమూత

వ్యాయామ అధ్యాపకులు కేఎల్ స్వరూప్ కన్నుమూత..

బాపట్ల ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసిన స్వరూప్..

ప్రస్తుతం మాచర్ల డిగ్రీ కళాశాలలో పీడీగా బాధ్యతలు..

స్వరూప్ మృతితో పలువురి దిగ్భ్రాంతి

జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన క్రీడారత్నం రాలిపోయింది. ఎందరో విద్యార్థులను సుశిక్షితులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దిన వ్యాయామ అధ్యాపకులు కేఎల్ స్వరూప్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.. స్వరూప్ మృతి పట్ల బాపట్ల ప్రాంతంలో పలువురు దిగ్భ్రాంతి కి గురయ్యారు
బాపట్ల మండలం మురుకుండపాడు
గ్రామానికి చెందిన వ్యాయామ అధ్యాపకులు కేఎల్ స్వరూప్ కన్నుమూశారు.. బాపట్ల ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసిన ఆయన రెండేళ్ల క్రితం మాచర్లకు బదిలీ అయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు కన్నుమూశారు. వేలాదిమంది విద్యార్థులకు ఆయన క్రీడా రంగాల్లో తర్ఫీదును అందించారు. స్వరూప్ వద్ద శిక్షణ పొందిన అనేకమంది విద్యార్థులు జాతీయస్థాయిలో తమ ప్రతిభా పాటవాలను ఇనుమడింప చేసుకున్నారు.
పాఠశాల విద్య నుండే క్రీడల పట్ల మక్కువ పెంచుకున్న స్వరూప్ అదే క్రీడా స్ఫూర్తితో ఎందరికో మార్గదర్శకులయ్యారు. చదువుకున్న కళాశాలలోనే వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేశారు. అదే కళాశాలకు ప్రిన్సిపల్ గా వ్యవహరించారు. రెండేళ్ల క్రితం మాచర్లకు బదిలీ అయిన ఆయన
అక్కడి ప్రభుత్వ
డిగ్రీ కళాశాలలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్వరూప్ శిక్షణ అందించిన అనేకమంది మంచి హోదాల్లో స్థిరపడి ఉన్నారు. ఇండియన్ ఆర్మీ, పోలీస్ శాఖలో ఉద్యోగ అవకాశాలు సంపాదించుకున్న అనేకమంది స్వరూప్ శిష్యులే కావటం విశేషం. కొన్ని వేల మందికి ఆయన ఒక ఆదర్శం. క్రీడా రంగాన స్ఫూర్తిదాయకం. విద్యార్థులను మంచి క్రీడాకారులుగా తయారు చేయాలన్న నిరంతర తపన, అదే ఆలోచనతో తన జీవితకాలం మొత్తం గడిపారు స్వరూప్.. జాతీయస్థాయిలో అనేక ప్రశంసా పత్రాలు అందుకున్నారు. జాతీయ స్థాయిలో జరిగే అథ్లెటిక్స్ లో పాల్గొని పతకాలు సాధించిన ప్రతి విద్యార్థి వెనుక స్వరూప్ నిర్మాణాత్మకమైన కృషి ఉందని చెప్పటం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అంతగా ఆ రంగంలో స్థిరపడిపోయారు స్వరూప్. వేలాదిమంది విద్యార్థులకు శిక్షణ అందించారు స్వరూప్.
క్రీడారంగంలో అనేకమంది ఆణిముత్యాలను తయారు చేయటంలో స్వరూప్ కృషి మరువలేనిది. మరచిపోలేనిది..


SAKSHITHA NEWS