ఆలయాల అభివృద్ధి పనులపై జేఈవో సమీక్ష
టీటీడీ ఆలయాల అభివృద్ధి పనులపై జేఈవో వీరబ్రహ్మం అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ , ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరంలో ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమష్టిగా పనిచేయాలని కోరారు. ధర్మప్రచార రథాల ద్వారా పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు . భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవకులను ఆహ్వానించాలని సూచించారు.
జమ్మూలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 3 నుంచి 8వ తేదీ వరకు మహాసంప్రోక్షణ జరుగనుందన్నారు . ఇందుకోసం తగినంత మంది సిబ్బందిని డెప్యుటేషన్ పై పంపాలని ఆదేశించారు. సిబ్బందికి బస, భోజన వసతి కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఆలయం వద్ద పచ్చదనం పెంచాలని డిఎఫ్ఓను ఆదేశించారు. ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. మహాసంప్రోక్షణ కార్యక్రమం గురించి తెలిసేలా శ్రీ వైష్ణోదేవి ఆలయం, ఇతర ప్రముఖ ప్రాంతాల్లో హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రచార రథంతో పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.
జూన్ 13న తిరుపతిలోని పేరూరు బండ వద్ద గల వకుళమాత ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. అక్కడ ఇంజినీరింగ్, అటవీ విభాగాల ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు.
ఈ నెల 13న తాతయ్యగుంట గంగమ్మకు టీటీడీ తరఫున సారె సమర్పించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ అధికారులను ఆదేశించారు. గతేడాది నిర్దేశించిన మార్గంలోనే భజన బృందాల భజనలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా సారెను తీసుకెళ్లాలన్నారు.
ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని కపిలతీర్థంలో పురాతన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో మే 14న మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు.
అన్ని ఆలయాల్లో టీటీడీ సిబ్బంది, భక్తులు, శ్రీవారి సేవకుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుని తనకు సమర్పించాలని జేఈవో ఆదేశించారు. అవసరమైన ఆలయాల్లో జలప్రసాదం యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. మెరుగైన పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక డ్రైవ్ చేయాలని సూచించారు. దాతల సహకారంతో ఆలయాల వద్ద అన్నప్రసాదాలు పంపిణీకి తగిన చర్యలు చేపట్టాలన్నారు. నిర్మాణంలో ఉన్న ఆలయాలు, కళ్యాణ మండపాలపై నివేదిక సమర్పించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
వర్చువల్ సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీనివాసులు, డిఎఫ్వో శ్రీనివాస్, డిఈ ఎలక్ట్రికల్స్ చంద్రశేఖర్, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, డెప్యూటీ ఈవోలు శ్రీమతి శాంతి, రమేష్ బాబు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.