పందులు అమ్ముకున్న వినుకొండ కమిషనర్ ..
గవర్నర్కు ఫిర్యాదు చేసిన పందుల పెంపకం దారులు
విచారణ చేపట్టిన డిప్యూటీ కలెక్టర్
సాక్షితవినుకొండ: వినుకొండ పురపాలక సంఘం కమిషనర్ తమ పందులను అమ్ముకున్నాడని పందుల పెంపకం దారుడు దార్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మరికొందరు బాధితులు రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ విచారణ నిమిత్తం పులిచింతల ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ సి శ్రీరాములను నియమించగా ఆయన వినకొండ తాసిల్దార్ కార్యాలయంలో బాధితులను, మున్సిపల్ కమిషనర్ బి. శ్రీనివాస్ లను పిలిపించి విచారణ చేపట్టారు. సాయంత్రం పందులు పెంపకం ప్రాంతమైన చెక్క వాగు వద్దకు వెళ్లి పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని, సేకరించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందని డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ తెలిపారు. విచారణలో వినుకొండ తాసిల్దార్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
20 లక్షల ఇరవై చేసే పందులను అమ్ముకున్నారు.
వినుకొండ కమిషనర్ బి. శ్రీనివాసులు సుమారు 20 లక్షలు చేసే పందులను దౌర్జన్యంగా పట్టుకొని అమ్ముకున్నట్లు ఫిర్యాదుదారుడు దార్ల కోటేశ్వరావు తో పాటు 70 మంది బాధితులు డిప్యూటీ కలెక్టర్ వద్ద వాపోయారు. గత నాలుగు నెలల క్రితం నాలుగు లారీల్లో 400 పందుల్ని విడతలవారీగా పట్టుకుని తీసుకువెళ్లారని వివరించారు. గొర్రెలు, మేకలు, బర్రెల పెంపకం లాగానే తాము పందుల పెంపకం పై ఆధారపడి జీవిస్తున్నామని తెలిపారు. వినుకొండలో సుమారు 100 కుటుంబాలు మూడు తరాలుగా పందులు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. వినుకొండ ప్రాంతంలో పందులు ఉండడానికి వీల్లేదని కమీషనర్ హెచ్చరికలు జారీ చేయడంతో పట్టణానికి దూరంగా చెక్క వాగులో పందుల పెంపకం చేసుకుంటున్నట్లు తెలిపారు.
నాలుగు నెలల క్రితం మున్సిపల్ కమిషనర్ సుమారు 40 మంది వ్యక్తులను పిలిపించి పందులను పట్టించి లారీల్లో తరలించాడని తెలిపారు. అడ్డుకున్న తమను, మా కుటుంబ సభ్యులను పోలీసులతో బెదిరించి స్టేషన్లలో కూర్చోబెట్టి పందులు పట్టుకోవడం జరిగిందన్నారు. సుమారు 400 పందుల్ని పట్టుకుని బెంగళూరు మార్కెట్లో అమ్ముకున్నట్లు వివరించారు. ఒక్కొక్క పంది విలువ 7 నుంచి 12 వేల వరకు ఉంటుందని, పట్టుకు వెళ్ళిన పందులు విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని తెలిపారు. పందుల పెంపకం తమ వృత్తి అని, పందులను కొనుగోలు చేసుకుని పెంచి అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటామని, 400 పందులను తీసుకువెళ్లడంతో తమ కుటుంబాలు అప్పుల పాలై తీవ్రంగా నష్టపోయామని తెలిపారు. పందులను పట్టుకొని అమ్ముకున్న కమిషనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు అధికారులను కోరారు.