జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
వైద్య కళాశాల ఏర్పాటు సంబంధ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ క్షేత్ర స్థాయిలో వైద్య కళాశాల పనుల పురోగతిని తనిఖీలు చేశారు. చేపట్టాల్సిన పనులు, పూర్తయిన పనులు, ఇంకనూ కావాల్సిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్య కళాశాల ను ఈ సంవత్సరం నుండే ప్రారంభించుటకు అనుమతులు వచ్చినట్లు తెలిపారు. 100 సీట్లతో 2023-24 సంవత్సరం వైద్య కళాశాల తరగతులు ప్రారంభం కానున్నట్లు ఆయన అన్నారు. క్లాస్ గదులు, అనాటమి తదితర విభాగాల పనులు ఆయన పరిశీలించారు.
బ్యాంకు, పోస్టాఫీసు, నాన్ గెజిటెడ్ అధికారుల కార్యాలయ భవనాలు ఇంకనూ ఖాళీ చేయకపోవడంపై కలెక్టర్ వారిని వెంటనే, ఖాళీ చేసి వైద్య కళాశాలకు అప్పగించాలన్నారు. పనుల్లో వేగం పెంచాలని, కూలీల సంఖ్య పెంచాలని ఆయన సూచించారు.
కలెక్టర్ తనిఖీ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా సహాయ కలెక్టర్ రాధికా గుప్తా, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. రాజేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, టీఎస్ఎంఐడిసి ఇఇ ఉమామహేశ్వరరావు, డిఇ శ్రీనివాస్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, వైద్యాధికారులు, అధికారులు తదితరులు ఉన్నారు.