వేడుకగా స్మార్ట్ కిడ్జ్ పాఠశాల వార్షికోత్సవం.
- హాజరైన ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ నీరజ, మువ్వా, అట్లూరి.
- అబ్బురపరిచిన విద్యార్థుల నృత్యాలు.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
స్థానిక స్మార్ట్ కిడ్జ్ స్కూల్ 11వ వార్షికోత్సవం స్థానిక సప్తపది ఫంక్షన్ హాల్ లో బుధవారం ఆనందోత్సవాలతో జరిగింది. విద్యార్థులు సంప్రదాయ నృత్యంతో అతిధులకు, తల్లిదండ్రులకు స్వాగతం పలికారు. తొలుత అతిధులు ఎమ్మెల్సీ తాతా మధు, నగర మేయర్ పూనకొల్లు నీరజ, పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య, ఫేమా కన్వీనర్ మువ్వా శ్రీనివాసరావు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు అట్లూరి వెంకటరమణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ సిహెచ్ ప్రశాంతి, పాఠశాల డైరెక్టర్ చింత నిప్పు సుకన్య లు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య పాఠశాల ప్రగతి నివేదికను అందించారు.ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ గత 11 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన స్మార్ట్ కిడ్జ్ పాఠశాల తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహంతో జిల్లాలోనే ఒక ప్రత్యేక విద్యాసంస్థగా ఎదిగిందన్నారు. విద్యార్థులను చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతికం, సైన్స్ ఎక్స్పో, సృజనాత్మక అంశాలు, పర్వదినాల నిర్వహణ , ఫీల్డ్ ట్రిప్స్ నిర్వహణ, స్కూల్ డే లు, సామాజిక సేవా కార్యక్రమాలు, హరితహారం తదితర విభాగాలలో విద్యార్థులను ఎదిగేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. ముఖ్యఅతిథి ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ స్మార్ట్ కిడ్జ్ లో విద్యార్థులను ప్రత్యేక శైలితో తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని చదువులో ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. నగర మేయర్ పూనకొల్లు నీరజ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని , బాల్యంలో నేర్చుకున్న విద్యా పునాదులతోనే రేపటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. అందుకే చిన్నారులు చదువుల పట్ల శ్రద్ధగా ఉండి ఎదగాలన్నారు. ఫేమా కన్వీనర్ మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్న పాఠశాల యాజమాన్యం పనితీరు అభినందనీయమన్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు అట్లూరి వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు ప్రముఖ స్థానం ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రోత్సహించాలన్నారు. సమాజంలో జరుగుతున్న విషయాలను తమ పిల్లలకు తెలియజేస్తూ వారిని సమాజంలో ఉన్నతంగా నిలిపేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య విషయంలో, ఆహార పదార్థాల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య , పాఠశాల ప్రిన్సిపాల్ విజయ కుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సభలో వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. సభానంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ, జానపద, గిరిజన, పాశ్చాత్య నృత్యాలు అందరిని ఉర్రూతలూగించాయి.