మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయకపోతే తెలంగాణ తరహాలో ఉద్యమించి సాధిస్తాం
న్యూఢిల్లీలో కవిత నిరసన దీక్షకు నామ సంఘీభావం
మాటలు కాదు చేతల్లో చేసి చూపించాలి
కవిత నిరసన దీక్షలో కేంద్రంపై బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు మండిపాటు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ లోక్ సభ సెషన్ లోనే ప్రవేశపెట్టి, ఆమోదించాలని, లేకుంటే తెలంగాణ తరహాలో పోరాడి మేమే సాధించుకు తీరుతామని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బిల్లును పార్లమెంట్లో ఆమోదించేంత వరకు కేంద్రాన్ని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి, ఆమోదించాలనే డిమాండ్ తో శుక్రవారం భారత జాగృతి సంస్థ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరసన దీక్షకు మద్దతుగా నామ దీక్షలో కూర్చుని, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ సుధీర్ఘకాలంగా మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉందన్నారు.
బిల్లు పాస్ అయితే చట్ట సభల్లోకి మహిళలు పెద్ద ఎత్తున అడుగు పెట్టి, ప్రజా సమస్యలపై ఎక్కువ స్థాయిలో తమ వాణి వినిపించడానికి అవకాశం ఉంటుందన్నారు. కానీ కేంద్ర సర్కార్ బిల్లు అమోదించకుండా నిర్లక్ష్యవైఖరిని అవలంభిస్తూ కావాలనే కాలయాపన చేస్తుందన్నారు. 16లో లోక్ సభలో ఈ బిల్లు కోసం కేంద్రంపై వత్తిడి తీసుకురావడం జరిగిందని, 17వ లోక్ సభలో బీఆర్ఎస్ ఎంపీలమంతా మాట్లాడం జరిగిందని చెప్పారు. పార్లమెంటరీ నాయకులు మీటింగ్ లో కూడా ఈ విషయమై ప్రస్తావించడం జరిగిందని తెలిపారు. కనీసం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లును ఆమోదించి, మహిళలకు సపోర్టుగా నిలవాలని, లేకుంటే చరిత్రలో మహిళా వ్యతిరేకులుగా నిలిచిపోతారని నామ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం మాటలు తప్ప చేతల్లో చేసి చూపించడం లేదని మండిపడ్డారు.
అందుకే కవిత తెలంగాణ నుంచి ఢిల్లీ వచ్చి నిరసన దీక్షకు కూర్చొవాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగానైతే రోడ్ల మీదకు వచ్చి పోరాడి సాధించుకున్నామో అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా సాధించుకుంటామని నామ పేర్కొన్నారు. మహిళలంతా సమైఖ్యమై బీజేపీపై పోరాడేందుకు ఇదే మంచి సమయం, అవకాశం అన్నారు. 2014 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లపై బీజేపీ మాట ఇచ్చి తప్పిందని, 2019 ఎన్నికల్లోనూ మళ్ళీ మాట మార్చారని నామ ధ్వజమెత్తారు. రాజ్యసభ ఆమోదించినా కేంద్రం ఎందుకు ఇన్నేళ్లూ బిల్లును పెండింగ్లో పెట్టిందని నామ ప్రశ్నించారు. ప్రపంచాన్ని గమనిస్తే ఆస్ట్రేలియా పార్లమెంట్లో 30 శాతం, సౌతాఫ్రికాలో 42, స్వీడన్ 47, చైనా 25, నేపాల్ 32, యూకే 32 శాతానికి పైగా మహిళా ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంటే భారతదేశంలో కేవలం 11 శాతం మంది మహిళలు మాత్రమే చట్ట సభల్లో ప్రాతినిధ్యం ఉందని నామ గుర్తు చేశారు. కవిత చేసే పోరాటానికి అండగా ఉండి, రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని నామ స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశవరావు కూడా పాల్గొని మాట్లాడారు.