పన్నులు చెల్లించి నగరాభివృద్దికి సహకరించండి – కమిషనర్ అనుపమ అంజలి
సాక్షిత : తిరుపతి నగరాభివృద్దికి సహకరించి బకాయిలున్న వున్నవారు వెంటనే తమ పన్నులు చెల్లించాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి ప్రజలనుద్దెశించి కోరారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశమైన కమిషనర్ అనుపమ మాట్లాడుతూ పన్నులు పూర్తిగా వసూలు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
నగరంలో అవసరమైన ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని చెబుతూ నీటి సరఫరా గురించి మాట్లాడుతూ శుద్ది చేసిన నీటిని ప్రజలకి నిరంతరం అందిస్తున్నామని, అదేవిధంగా మురికినీటి పారుదలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ప్రజలు గ్రహించే విధంగా అధికారులు పని చేయాలన్నారు. ఈ సంవత్సరం మార్చి బడ్జెట్ విషయాన్ని ప్రస్థావిస్తూ పన్ను బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారులతోబాటు సచివాలయ అడ్మిన్లు, అమ్నెటీ, ప్లానింగ్, వెల్ఫెర్, శానిటరీ, రెవెన్యూ సెక్రటరీలను సమన్వయ పరిచి పన్నులను వసూలు చేయాలన్నారు.
మొండి పన్ను బాకాయిల గురించి మాట్లాడుతూ అవసరమైన లీగల్ చర్యలను చేపట్టాలని అధికారులకు కమిషనర్ అనుపమ అంజలి ఆదేశాలు జారీచేసారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులు కె.ఎల్.వర్మ, సేతు మాధవ్, మేనేజర్ చిట్టిబాబు పాల్గొన్నారు.