SAKSHITHA NEWS

హరితహారం క్రింద మొక్కలు నాటుటకు పకడ్బందీ కార్యాచరణ చేయాలి.
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ :

హరితహారం క్రింద మొక్కలు నాటుటకు పకడ్బందీ కార్యాచరణ చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో తెలంగాణ కు హరితహారం కార్యక్రమ అమలుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2023 సంవత్సరంలో 32.477 లక్షల మొక్కలు నాటుటకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. లక్ష్య సాధనకు శాఖల వారిగా లక్ష్యం ఇచ్చి పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన అన్నారు.

అటవీ శాఖ ద్వారా 7.6 లక్షలు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ద్వారా 10 లక్షలు, నీటిపారుదల శాఖచే 2.477 లక్షలు, వ్యవసాయం, సహకార శాఖల ద్వారా 4.5 లక్షలు, రెవిన్యూ శాఖకు 60 వేలు, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ కు 4.780 లక్షలు, విద్యా శాఖకు 30 వేలు, పరిశ్రమల శాఖకు 30 వేలు, గనుల శాఖకు 60 వేలు, విద్యుత్ శాఖచే 1.320 లక్షల మొక్కల నాటడం లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు.

నర్సరీల్లో సీడ్ డిబ్లింగ్, జెర్మేషన్ ప్రక్రియ మార్చి లోగా పూర్తిచేయాలన్నారు. ప్రైమరీ బెడ్ లను బలోపేతం చేయాలన్నారు. రైతుల జాబితా, ఎంత మేర మొక్కల నాటడం చేస్తున్నది కార్యాచరణ చేయాలన్నారు. లే అవుట్ గ్రీన్ స్పెస్, గోళ్లపాడు ఛానల్ పట్టణ ప్రకృతి వనాలు, ఎన్ఎస్పి కాల్వ వెంబడి మొక్కలు నాటుటకు కార్యాచరణ చేయాలన్నారు. ప్లాంటేషన్ కు బ్లాకులను గుర్తించి, ఏ సర్వే నెంబర్ లో, ఏ ఏ ప్రదేశాల్లో ఎంత మేర మొక్కల నాటడం చేసునున్నది పటిష్ట కార్యాచరణతో వచ్చే సమావేశానికి హాజరవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జెడ్పి సిఇఓ అప్పారావు, డిఆర్డీఓ విద్యాచందన, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయ నిర్మల, జిల్లా ఉద్యానవన అధికారిణి అనసూయ, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి వెంకట్రాం, ఎఫ్డివో ప్రకాశరావు, మునిసిపల్ కమిషనర్లు రమాదేవి, సుజాత, సునీత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS