SAKSHITHA NEWS

లాయర్లకు నిరంతర వృత్తి పరిజ్ఞానం అవసరం – శిక్షణ తరగతుల్లో 3వ జిల్లా జడ్జి వై.వీర్రాజు

                                               సాక్షిత, తిరుపతి బ్యూరో: న్యాయవాదులు వృత్తి పరమైన పరిజ్ఞానం కలిగి చట్టాల అమలుపై అవగాహన ఉంటెనే సమర్థవంతంగా రాణించగలరని తిరుపతి 3వ అదనపు జిల్లా జడ్జీ వై వీర్రాజు పేర్కొన్నారు. తిరుపతి యూత్ హాస్టల్లో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ( ఐలు) నిర్వహించిన ఒక్కరోజు న్యాయవాద శిక్షణా తరగతులను శనివారం ఆయన తిరుపతి యూత్ హాస్టల్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి వీర్రాజు మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులు కేసులు వాదించేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు, కోర్టు పద్ధతులు తెలుసుకోవాలన్నారు. అలాగే వృత్తిలో మెళకువలకు సంబంధించి ప్రత్యేకంగా ఎవరూ న్యాయవాదులకు శిక్షణ ఇవ్వరని, వారే కోర్టు జరిగే సమయంలో సీనియర్స్ కేసులు ఎలా వాదిస్తున్నారనేది పరిశీలించి, కోర్టు ప్రక్రియ లను అధ్యయనం చేస్తూ నేర్చుకోవాలన్నారు. న్యాయవాదులుగా నమోదు చేసుకుని కోర్టుకు వచ్చే జూనియర్ న్యాయవాదులు కనీసం మూడేళ్ల పాటు కోర్టుల నిర్వహణ, కేసుల ఫైలింగ్ విధానం, బెంచ్ ప్రొసీడింగ్స్ నేర్చుకోవాలన్నారు. అలా నేర్చుకుంటే కేసుల వాదనలో ప్రతిభ చూపటానికి అవకాశం ఉంటుందన్నారు. క్రమం తప్పకుండా ఇలాంటి వృత్తిపరమైన శిక్షణా తరగతులను న్యాయవాద యూనియన్ (ఐలు) నిర్వహించటం అభినందనీయం అన్నారు. సీనియర్ న్యాయవాదైన ,జూనియర్ న్యాయవాదైన చట్టాలపై స్పష్టమైన అవగాహనతో ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ఉదహరించాలన్నరు. అలా చేయాలంటే న్యాయవాదులు కేసు పూర్వాపరాలను పూర్తిగా నోట్స్ రాసుకుని ఆ కేసు లో ఎలా వాదించొచ్చు అనేది కసరత్తు చేయాలన్నారు. అప్పుడు మాత్రమే తాము వాదిస్తున్న కేసులో కక్షిధారి తరపున సమర్థవంతంగా వాదనలు కోర్టు ముందు వినిపించగలరని పేర్కొన్నారు. అనంతరం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ వై శ్రీనివాసరావు న్యాయవాదులకు లిమిటేషన్ యాక్ట్, కోర్టు ఫీజు, సూట్ ఫైలింగ్, వివిధ న్యాయవాద ప్రక్రియలను కోర్టు ఫీజు సూట్ ఫైలింగ్ , సంబంధిత సెక్షన్లను  సోదాహరణంగా వివరించారు. సూట్లు ఫైల్ చేసేటప్పుడు అవి తిరస్కరణకు గురి కాకుండా ఏ సెక్షన్ కింద, లిమిటేషన్ యాక్ట్ లో ఏ ఆర్టికల్ కింద తాము వేస్తున్న సూట్ వస్తుందనే వివరాలు స్పష్టంగా పేర్కొనాలని తెలిపారు. చివరగా ఐదవ అదనపు జడ్జి జి.అన్వర్ భాష కుటుంబ చట్టాలు, కేసుల ఫైలింగ్ విధానం, ఫ్యామిలీ కోర్టు పరిధి హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ అలాగే ఇతర అనుబంధ చట్టాలు, వాటి అమలు కేసులు దాఖలు చేసేటప్పుడు న్యాయవాదులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పేర్కొనాల్సిన సెక్షన్లను తెలియజేశారు. 

ఈ సందర్భంగా ఐలు నాయకులు న్యాయవాదులు పత్తికొండ మురళి, హేమ చంద్రారెడ్డి, దేవరాజులు, మురళి, వెంకట్రామయ్య, ఏపి బార్ కౌన్సిల్ సభ్యులు సీనియర్
న్యాయవాది గల్లా సుదర్శన్ ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి బార్ అసోియేషన్ కార్యదర్శి హరినాథ్ నాయుడు, ఉపాధ్యక్షులు మురళీమోహన్, సీనియర్ న్యాయవాదులు నరహరి రెడ్డి, యోగానంద్, పి సి మురళి బాబు, నాగసురి, సుబ్రమణ్యం, హరి, రాజశేఖర్, బార్ అసోియేషన్ జాయింట్ సెక్రటరీ మంజుల, బార్ అసోసియేషన్ మహిళ ప్రతినిధి పద్మజ, హేమలత, జూనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS