కాజీపేట రైల్వే వ్యాగన్ మ్యానిఫాక్చర్ యూనిట్, కాజీపేట రైల్వే జంక్షన్, రైల్వే హాస్పిటల్ అభివృద్ధి పనులను పరిశీలించిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య
కాజీపేట: అయోధ్యపురంలో 160 ఎకరాలలో నిర్మాణం చేస్తున్న రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమ నిర్మాణ పనులను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు పరిశీలించారు. ఈ సందర్బంగా సంబంధిత శాఖ అధికారులతో కలిసి వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. చిరకాల కోరిక అయినా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించుకునేందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీ సాధించుకుంటే కాజీపేట జంక్షన్ ను సికింద్రాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. అలాగే స్థానికంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. కాజీపేట రైల్వే డివిజన్, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారితో కలిసి కాజీపేట రైల్వే స్టేషన్ జంక్షన్ ను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు సందర్శించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మీడియాతో మాట్లాడుతూ….
ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలిపే కాజీపేట రైల్వే జంక్షన్ పై రైళ్ల రద్దీ పెరుగుతోందని, రైళ్ల హాల్టింగ్, క్రాసింగ్ తో రాకపోకలకు అంతరాయం ఏర్పడటమే కాకుండా ప్రయాణికులు కూడా అవస్థలు పడాల్సి వస్తోందని, ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మరికొన్ని ప్లాట్ ఫామ్ లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య గారు అన్నారు.
రైల్వే స్టేషన్ లో నిర్మాణంలో ఉన్న ఆర్ఓబి తో పాటు వెయిటింగ్ హాల్ పనులను పరిశీలించిన ఎంపీ మహిళలకు ప్రత్యేకంగా వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దివ్యాంగులకు సైతం ప్రత్యేకంగా, వెయిటింగ్ హల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులతో మాట్లాడిన ఎంపీ సౌకర్యాలపై ఆరా తీశారు. 30 ఏళ్లుగా రైల్వే స్టేషన్ సమీపంలో బస్టాండు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అంతేకాకుండా డీజిల్ కాలనీలో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని త్వరలో జీఎం గారికి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు. అనంతరం రైల్వే ఆసుపత్రిని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం గారు సందర్శించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి వైద్య సేవలు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని ప్రతి విభాగాన్ని ఎంపీ డా. కడియం కావ్య క్షుణ్ణంగా పరిశీలించారు. ఆస్పత్రిలోని పలు సమస్యలను తెలుసుకున్న ఎంపీ త్వరలోనే వాటి పరిష్కార దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ప్లానింగ్ హెడ్ క్వాటర్ సికింద్రాబాద్ లక్ష్మీనారాయణ, సీనియర్ డిఎన్ఏ డీజిల్ కాలనీ వెంకట్, సిడిఎంఈ డీజిల్ అనికేత్, ADN NORTH రామరాజు, ఎస్ ఎస్ సి వర్క్స్ సత్య రావు, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.