బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ అన్నారు. బతుకమ్మ (అక్టోబర్ 10) పండుగను పురస్కరించుకుని మంత్రి సురేఖ తెలంగాణ ఆడపడుచులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రంగు రంగుల పూల రూపంలోని ప్రకృతి పట్ల ఆరాధనను, స్త్రీ శక్తిని కొలిచే పండుగగా బతుకమ్మ పండుగకు తెలంగాణ సంస్కృతిలో విశిష్ట స్థానమున్నదని మంత్రి సురేఖ అన్నారు. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి మొదలు యావత్ తెలంగాణ పూలవనాన్ని తలపించేలా బతుకమ్మలతో కొత్త కళను సంతరించుకున్నదని మంత్రి సురేఖ అన్నారు. చారిత్రకంగా బృహదమ్మ(పార్వతి దేవి) పేరు మీదుగా బతుకమ్మ పండుగ సంప్రదాయంగా స్థిరపడిందని మంత్రి సురేఖ తెలిపారు. భూమాతతో, జల సంపదతో మానవ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఒక సంబరంగా వేడుకలను జరుపుకోవడమే బతుకమ్మ పండుగ పరమార్థమని మంత్రి సురేఖ అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా బతుకమ్మ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నదని మంత్రి సురేఖ తెలిపారు. వీరోచిత పోరాటంతో నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛావాయువులు అందించిన కాంగ్రెస్ పార్టీ, అదే ఉద్యమ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్రాన్ని మహోజ్వల రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.