ఎన్నికల వేళ ఈసీ ఇచ్చిన ఆదేశాలు శిరోధార్యం అని సీఎఫ్‌డీ (Citizens for Democracy) కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలిపారు.
వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా మాత్రమే ఉంచారన్న నిమ్మగడ్డ, రాజీనామా చేసిన వారిని మళ్లీ తీసుకుంటామనడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అని మండిపడ్డారు.
వాలంటీర్లు బూత్‌ల్లో ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని ఈసీకి చెప్పామని అన్నారు.
వాలంటీర్లపై తమకు సానుభూతి ఉందని, రద్దు చేయాలని తాము కోరలేదని స్పష్టం చేశారు.
వాలంటీర్ల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడటాన్నే తాము వ్యతిరేకిస్తున్నామన్న నిమ్మగడ్డ, అధికార, ప్రతిపక్షాల ప్రలోభాలకు లొంగవద్దని వాలంటీర్లను కోరుతున్నామన్నారు. వాలంటీర్లను ప్రధాన సమస్యగా సృష్టించడాన్ని సీఎఫ్‌డీ వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లకు చేరుతున్నాయని, ఒక్కొక్కరిపై సుమారు రూ.2 లక్షల అప్పు ఉందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యత సాధించాలని కోరారు. ప్రభుత్వ సలహాదారులు ప్రజా సేవకులు అని, ప్రభుత్వ వేతనం తీసుకుంటున్నారని, అటువంటి వారు రాజకీయ చర్చలో పాల్గొనకూడదని అన్నారు. సమయం, సందర్భం మేరకు కచ్చితంగా ఉండాలని సీఈవోను కోరామని చెప్పారు. ఎన్నికల వేళ స్వతంత్రంగా పనిచేసే ధైర్యం ఎన్నికల సంఘం అధికారులకు ఉండాలని తెలిపారు. ఎన్నికల సంఘం అధికారుల కార్యాచరణ ద్వారా ప్రజలకు నమ్మకం కలిగించాలని కోరుతున్నామని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు.