ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్
ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ట్రోలింగ్స్ హుందా తనంగా ఉండకుండా వ్యక్తిగత విమర్శలకు దిగి చాలా ప్రమాదకర స్థాయికి వెళ్ళాయని ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తెనాలి పట్టణంలో సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబ సభ్యులను ఆయన సోమవారం పరామర్శించి వారికి 50 వేలు ఆర్థిక సహాయం చేశారు. అనంతరం గీతాంజలి భర్త బాలచందర్ కుమార్తెలు రిషిత రుషిక లను హత్తుకుని తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.
నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని ఆడపిల్లలకు తల్లి లేని లోటు ఎవ్వరూ పూడ్చలేనిదన్నారు. ఈ వయసులో వారికి తెలియకపోవచ్చు కానీ 10 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఆ తల్లి లేని బాధ వారికి అర్థమవుతుందని ఆ చిన్నారులని ఇద్దరిని తన ఒళ్ళు కూర్చోబెట్టుకుని కోన వెంకట్ కళ్ల వెంట కన్నీరు కార్చారు. ఇది చాలా దారుణమైన విషయం నేను కూడా ఇటీవల ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయని ఒక మారుమూల ప్రాంతానికి వెళ్లి ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నన్ను కూడా విపరీతంగా ట్రోల్ చేశారని అయినా నేను వాటిని పట్టించుకోలేదు అన్నారు. కానీ సున్నిత మనస్కులు ఈ ట్రోలింగ్స్ తట్టుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని దయచేసి ఎవరిని వ్యక్తిగతంగా ట్రోలింగ్ చేయకూడదని ఇది ఎవ్వరు చేసిన తప్పేనని ఆయన తెలిపారు. ప్రభుత్వం కూడా ఇలాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించి ప్రత్యేక చట్టాలు తయారు చేయాలన్నారు. ఇప్పటినుంచి నాకు నలుగురు కూతుర్లని గీతాంజలి కుమార్తెలను కూడా నా సొంత కుమార్తెల్లాగా పెంచుతాననీ వారికే అవసరం వచ్చిన నేనే ముందు ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.