- జివిఎంసి కమిషనర్ సిఎం.సాయికాంత్ వర్మ
విశాఖపట్నం : నగరంలో ప్రధాన రహదారులు, వీధులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని జివిఎంసి కమిషనర్ సిఎం.సాయికాంత్ వర్మ ప్రజారోగ్యపు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జోన్-3, 5 పరిధిలోని 26, 14, 45, 48, 49, 50, 51 వార్డుల పరిధిలోని అక్కయ్యపాలెం, లలితా నగర్, నరసింహ నగర్, కైలాసపురం గిరి ప్రదర్శన రోడ్డు, మాధవధార, మురళి నగర్ నేషనల్ హైవే, తాటిచెట్ల పాలెం, గ్రీన్ బెల్ట్ తదితర ప్రాంతాలలోని రోడ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రధాన రహదారులు, వీధులు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించామని తెలిపారు. లలితనగర్ లో వసుంధర క్యాస్టల్ అపార్ట్మెంట్ వద్ద రోడ్డుపై వ్యర్ధాలు ఉండడం గమనించి ఆ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్లాప్ వాహనాల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ జరుగుతున్నప్పుడు రోడ్లపై వ్యర్ధాలు ఎందుకు ఉన్నాయని ఆరా తీశారు. తడి పొడి, హానికర వ్యర్ధాలు ఇంటి వద్దే వేరు చేసి క్లాప్ వాహనాలకు అందించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులు ఎవరికి నిర్దేశించిన ప్రదేశాలలో వారిని తప్పకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. క్లాప్ వాహనాలు నిర్ణీత సమయానికే ఇంటింటి నుండి వ్యర్ధాలను సేకరించే విధంగా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ ను, ఎ.ఎం.ఒ.హెచ్.లను ఆదేశించారు. ఎంతో మంది పర్యాటకులు నగరానికి విచ్చేస్తున్నందున ముఖ్యంగా నగరంలోని ప్రధాన రహదారులు పరిశుభ్రంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు పారిశుద్ధ కార్మికులచే వ్యర్థాలను తొలగించాలని, రోడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆయా ప్రాంత శానిటరీ ఇన్స్పెక్టర్లను కమీషనర్ ఆదేశించారు.