SAKSHITHA NEWS

ఇళ్ల నిర్మాణాలు చేసిన చోట.. మౌళిక వసతులు ఎక్కడ

ఎక్కడ చూసినా రోడ్డు, డ్రైనేజీల సమస్యలు కనిపిస్తున్నాయి

భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్

ధర్మవరం నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన చోట మాళిక వసతులు కల్పించలేదని.. అందుకే ప్రజలు నేటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా, ధర్మవరం పట్టణం 28వ వార్డు ఎల్-1, ఎల్-2 కాలనీల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి టిడిపి మినీ మేనిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. మ్యానిఫెస్టోలో ఉన్న పథకాల గురించి వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మహిళల కష్టాలు తీర్చే విధంగా టిడిపి అధినేత చంద్రబాబు కొన్ని పథకాలు తీసుకొచ్చారని వాటిని తెలియజేశారు. ఏ ఇంట్లో ఏ పథకం ద్వారా ఎంత మేర లబ్ది చేకూరుతుందని శ్రీరామ్ తెలియజేశారు. అదే సందర్భంలో స్థానికులు పెద్ద ఎత్తున సమస్యలను శ్రీరామ్ దృష్టికి తీసుకువచ్చారు.

కాలనీల్లో చాలా చోట్ల రోడ్లు డ్రైనేజీలు నిర్మాణం చేపట్టలేదన్నారు. కనీస అవసరమైన తాగునీరు కూడా సరిగా రాక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ప్రజలు రాజకీయ నాయకుల పై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తారని వారు దానికి బదులుగా కోరుకునేది కనీస మౌళిక సదుపాయాలు మాత్రమేనని శ్రీరామ్ అన్నారు. కనీసం రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు అందించకపోతే ఇక ప్రజాప్రతినిధులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. పట్టణం లో 20 ఏళ్ల క్రితం నిర్మించిన పైప్ లైన్ ఆధారంగానే నేటికీ నీరు అందుతోందని… నాటికి నేటికీ జనాభా ఎంత పెరిగిందన్నది ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలన్నారు. ఇంత జనాభాకు తాగునీరు అందుతుందా లేదా అన్నది వారే తెలుసుకోవాలని సూచించారు. టిడిపి అధికారంలోకి రాగానే ఈ కాలనీలో కచ్చితంగా మౌళిక వసతులు కల్పనకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఇస్తున్న ప్రతి హామీని నెరవేరుస్తుందని ఈ సందర్భంగా శ్రీరామ్ వ్యాఖ్యానించారు. ప్రజలు తమకు ఎవరైతే మంచి చేస్తారన్నది ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు..

Whatsapp Image 2024 01 19 At 6.10.20 Pm

SAKSHITHA NEWS