SAKSHITHA NEWS

మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అయోధ్య ధామ్’గా కొత్త పేరు ప్రకటన

గతంలో ఉన్న ‘మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం’ పేరు మార్పు
విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి రామాయణ ఇతిహాసాన్ని రచించిన కవి ‘మహర్షి వాల్మీకి’ పేరు పెట్టారు. ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అయోధ్య ధామ్’గా నామకరణం చేశారు. ఈ మేరకు గతంలో ఉన్న పేరు ‘మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం’ను మార్చారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (శనివారం) ఈ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నారు. జనవరి 22న అయోధ్య రామాలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమానికి ముందే ఈ ఎయిర్‌పోర్టులో సేవలు ప్రారంభం కానున్నాయి.

(డిసెంబర్ 30) నుంచే ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇక్కడ సర్వీసులు ప్రారంభించబోతున్నాయి. ఈ రెండు విమానయాన సంస్థలు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు ప్రకటించాయి. జనవరి నుంచి ఈ సర్వీసులు మొదలవుతాయని వెల్లడించాయి. కాగా దాదాపు రూ.1,450 కోట్ల అంచనాతో విమానాశ్రయం మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేశారు. కొత్త టెర్మినల్ భవనాన్ని 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. పీక్-అవర్‌లో 600 మంది ప్రయాణీకులకు వసతులు అందించగలిగేలా నిర్మించారు.

కాగా ఏడాదికి 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే స్థాయిలో ఎయిర్‌పోర్టును రూపొందించారు. ఇక రెండవ దశ అభివృద్ధిలో 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మించనున్నారు. రద్దీ సమయాల్లో 3,000 మంది ప్రయాణికులకు, ఏటా 60 లక్షల మంది ప్రయాణీకులకు సేవలు అందించే సామర్థ్యంతో నిర్మించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.


SAKSHITHA NEWS