ఓటర్ల లిస్టుల నుండి పేర్లు తొలగించేటప్పుడు, అదేవిధంగా కొత్త ఓటర్లను నమోదు చేసే విషయంలో చాలా పకడ్బందిగా, అన్ని ఆధారాలతో వుండాలని బూత్ లెవల్ అధికారులకు తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ తో జరిగిన సమావేశంలో కమిషనర్ హరిత బిఎల్వోలకు సూచనలు ఇస్తూ ముసాయిదా ఓటర్ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి జాబితాలోని ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలించి తుది జాబితా సిద్దం చేసేందుకు పని చేయాలన్నారు. ఇప్పటికే ప్రచురించబడ్డ ముసాయిదా ఓటర్ల జాబితాలో ముఖ్యంగా చనిపోయిన వారి ఓట్లను తొలగించి వున్న వాటిని మరోసారి క్షున్నంగా పరిశీలించాలని, చనిపోయిన వారి డెత్ సర్టిఫికేట్ వుందా లేదా అని పరిశీలించాలని, చనిపోయిన వారికి సంబంధించిన సంబంధికుల నుండి అర్జీ స్వీకరించి వుండాలనే విషయాలను పరిగణలోకి తీసుకొని రికార్డులు సిద్దం చేయాలన్నారు.
అదేవిధంగా కొత్తగా ఓటర్లు నమోదు అయ్యే వారి వివరాలను పూర్తి స్థాయిలో మరోసారి పరిశీలించాలని, డిసెంబర్ 9 వరకు 18 సంవత్సరాలు నిండిన వారిని కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ముసాయిదా జాబితా ఓటర్ల వివరాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ https://voters.eci.gov.in/ నందు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు కూడా తమ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ తెలియజేశారు. ఈ సమావేశంలో ఓటర్ నమోదు అదనపు అధికారులు తిరుపతి ఎమ్మార్వో వెంకటరమణ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, స్మార్ట్ సిటీ జిఎం చంద్రమౌళి, బిఎల్వోలు పాల్గొన్నారు.*