ప్రధాన కేంద్రాల వద్ద సూచికలు, వేగ నిరోధకాలు ఏర్పాట్లకు చర్యలు
- కమిషనర్ వికాస్ మర్మత్, ఐ.ఏ.యస్.,
నగర వ్యాప్తంగా పాఠశాలలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ప్రభుత్వ భవనాలు తదితర గుర్తించిన ప్రధాన కేంద్రాల వద్ద సూచికలు, వేగ నిరోధకాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశించారు. అధికారులతో కలిసి స్థానిక బి.వి. నగర్, కె.ఎన్.ఆర్. పాఠశాల, రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం తదితర ప్రాంతాల్లో పర్యటించి స్పీడ్ బ్రేకర్లు, సూచికల ఏర్పాటు ఆవశ్యకతను కమిషనర్ శనివారం పరిశీలించారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల మార్గాల్లో వేగ నిరోధకాల ఏర్పాటుతో పాటు వాహనాలు నిదానంగా వెళ్ళాలి అన్న సూచికలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా అన్ని ఆధ్యాత్మిక ప్రాంతాలవద్ద ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా ‘నో హారన్’ సూచిక, ట్రాఫిక్ అంతరాయం లేకుండా పార్కింగ్ సూచికలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.
అనంతరం స్థానిక ఎఫ్.సి.ఐ. కాలనీ, బి.వి .నగర్ సచివాలయాలను కమిషనర్ సందర్శించారు.
అక్టోబర్ 3 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న “జగనన్న ఆరోగ్య సురక్ష” కార్యక్రమ అమలును అన్ని సచివాలయాల్లో షెడ్యూలు ప్రకారము ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, జగనన్న ఆరోగ్య సురక్ష పథకం వైద్య సదుపాయాలు అవసరమైన ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా సచివాలయం హెల్త్ సెక్రెటరీలు అందరూ కృషి చెయ్యాలి అని కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ శర్మద, ఇంజనీరింగ్ ఎస్.ఈ. సంపత్ కుమార్, సిటీ ప్లానర్ దేవీ కుమారీ, నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.