SAKSHITHA NEWS

సాక్షిత అమరావతి : ఏపీలో ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వాహనాలకు ఇప్పటివరకూ ఇస్తున్న వివిధ సిరీస్ ల స్ధానంలో ఇకపై ఓ కొత్త సిరీస్ ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో ఇకపై ప్రభుత్వ వాహనాలకు ఏపీ 40జీ సిరీస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్న పాత వాహనాలు మాత్రం అవే సిరీస్, నంబర్లతో కొనసాగుతాయి. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ సిరీస్ తో నంబర్లను కేటాయిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాలు ఏపీ 18, ఏపీ 39 ఇలా వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి. అలాగే ప్రభుత్వం లీజుకు తీసుకుంటున్న ప్రైవేటు వాహనాలు సైతం వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి. వీటి స్థానంలో కొత్త సిరీస్ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ప్రభుత్వం వివిధ శాఖల్లో అవసరాల కోసం నేరుగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ ఏపీ 40జీ సిరీస్ నంబర్ కేటాయిస్తారు. ప్రభుత్వం ప్రైవేటు నుంచి లీజుకు తీసుకుని వాడుకునే వాహనాలకు మాత్రం ఇది వర్తించదు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకునేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. తమిళనాడులో జీ(గవర్నమెంట్) సిరీస్ తో వాహనాల రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.


SAKSHITHA NEWS