రైతు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై సమరశంఖం…

Sakshitha news

రైతు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై సమరశంఖం…

ఏఐకేఎంఎస్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి…

పెంచికలపేటలో మహాసభల గోడపత్రికల ఆవిష్కరణ….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, కమాన్‌పూర్// : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న అఖిల భారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర 9వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండేటి మల్లేశం పిలుపునిచ్చారు. మహాసభల ప్రచారంలో భాగంగా కమాన్‌పూర్ మండలంలోని పెంచికలపేట గ్రామంలో ఆదివారం గోడపత్రికలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా గుండేటి మల్లేశం మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.

స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు పంటలకు మద్దతు ధర కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం, పెట్టుబడిదారీ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం వల్ల దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు.

పంటలకు సరైన ధరలు లభించక రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం, వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభల్లో సమగ్రంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు.

రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలను చైతన్యపరిచి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సమాయత్తం చేయడమే మహాసభల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు, కార్మికులు పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు ఇరువురాల గట్టయ్య, సాగర్ల నరసయ్య, జాటోత్ దేశినాయక్, ఎం.కాంతయ్య, ఈ.లింగయ్య, శివరాత్రి మల్లేష్, ప్రేమ్‌కుమార్, ఎం.లింగయ్య, ఈ.నాగేష్, సీహెచ్.శంకర్, అయిలయ్య, గుడిసెల స్వామి, అసంపెల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.