యూత్ డిక్లరేషన్ పేరుతో యువతకు పంగనామాలు..
హామీలన్నీ గాలికి!
మేము భర్తీ చేసిన ఉద్యోగాలకు.. నియామక పత్రాలిచ్చి గొప్పలు చెప్పుకుంటారా?
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలన్నారు.. 2 ఏళ్లలో ఇచ్చింది కేవలం 13 వేలు
కాంగ్రెస్ 20 ఏళ్లు అధికారంలో ఉన్నా ఆ హామీలు నెరవేర్చలేరు….ఉప్పల వెంటక రమణ
గురుకులాలు, మెడికల్ కళాశాలలతో విద్యారంగాన్ని అభివృద్ధి చేసింది కేసీఆరే: మాజీ ఎమ్మెల్యే మెచ్చా
అశ్వారావుపేటలో ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ కోసం విద్యార్థులు, యువతతో బీఆర్ఎస్ భారీ ర్యాలీ
కాంగ్రెస్ 420 మోసాలపై బీఆర్ఎస్ పోరుబాటలో భాగంగా ఐదో రోజు శనివారం
అశ్వారావుపేట సాక్షిత :
అశ్వారావుపేటలో గులాబీ శ్రేణులు, యువత కదం తొక్కారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ అమలు కోరుతూ అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో విద్యార్థులు, నిరుద్యోగ యువకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే , బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు మరియు బీఆర్ఎస్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు.
విద్యార్థులు, యువతను నిలువునా మోసం చేశారు: మెచ్చా నాగేశ్వరరావు
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గురుకులాలను అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసి పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించామని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గుర్తుచేశారు. జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి వైద్య విద్యను సామాన్యులకు చేరువ చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ఎన్నికల ముందు ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ పేరుతో యువతను, విద్యార్థులను నమ్మించి, తీరా అధికారంలోకి వచ్చాక వారిని నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు.
నియామక పత్రాలు ఇస్తే కాంగ్రెస్ ఉద్యోగాలు ఇచ్చినట్టేనా?: ఉప్పల వెంకటరమణ
కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతామని, ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్పి నిరుద్యోగులను దారుణంగా వంచించిందని ఉప్పల వెంకటరమణ విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 13 వేల ఉద్యోగాలు మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాసెస్ పూర్తి చేసి భర్తీ చేసిన ఉద్యోగాలకు.. ఇప్పుడు కేవలం నియామక పత్రాలు చేతికి ఇచ్చి తామే ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నియామక పత్రాలు ఇస్తే కాంగ్రెస్ ఉద్యోగాలు ఇచ్చినట్టేనా? ఏడాదిలోపు ఇస్తామన్న ఉద్యోగాలు.. వీళ్లు 20 ఏళ్లు అధికారంలో ఉన్నా పూర్తి చేయలేరని ఆయన దుయ్యబట్టారు.
ఇచ్చిన హామీలన్నింటినీ గాలికి వదిలేసి యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు,భారీ సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు,బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST